Hyd, April 26: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వాతావరణం ఆందోళనకరంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉంటే రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. వడగాడ్పులు అంతకంతకూ పెరుగుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ నివేదికలు చెబుతున్నాయి.
ఏపీలో గురువారం 16 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. దాదాపు 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మరో 72 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. రానున్న మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం ఏపీలో 174 మండలాల్లో వడగాల్పులు, 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రాబోయే రెండు రోజలు బయటకు వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి! వడగాల్పులు వీచే అవకాశముందని ఐఎండీ హెచ్చరిక, తెలంగాణలో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రామగుండం, భద్రచాలం పరిధిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, వృద్ధులు గర్భీణీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక రేపు తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.