CM KCR Press Meet | File Photo

Hyd, April 27: రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ యుక్త వయసులోకి ప్రవేశిస్తోంది. నేటి (ఏప్రిల్‌ 27)తో 21 ఏళ్లు పూర్తి చేసుకొని, 22వ యేట అడుగు (TRS Celebrates 21 Years) పెట్టబోతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రతినిధుల సభ (ప్లీనరీ) ( Hyderabad International Convention Centre (HICC) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మంగళవారం రాత్రి వరకు పూర్తయ్యాయి. బుధవారం నాటి ప్లీనరీ వేదికగా పార్టీ కేడర్‌కు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు (K Chandrashekar Rao) రాజకీయ, ప్రభుత్వపరమైన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పాత్రపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, సర్కారుపై విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునివ్వనున్నారు. మతతత్వ రాజకీయాలను దరిచేరనీయవద్దని, ఈ విషయంలో ప్రజలు జాగరూకతతో ఉండేలా చూడాలని సూచించనున్నారు. భవిష్యత్తుపై శ్రేణులకు భరోసా కల్పించడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ సుదీర్ఘకాలం పార్టీ రాణించటానికి కార్యకర్తలు నడుచుకోవాల్సిన మార్గాన్ని నిర్దేశించనున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా ప్లీనరీలో 11 తీర్మానాలపై చర్చ, ఆమోదం ఉంటాయని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు.

మతం, కులం పేరిట చిల్లర రాజకీయాలు, ఆల్వాల్ సభలో మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్, మూడు మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు భూమి పూజలు

ఈ క్రమంలోనే దేశం, రాష్ట్రానికి సంబంధించిన అంశాల ప్రస్తావనతోపాటు, పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్నారు. అలాగే 13 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ.. ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనా తీరును సమీక్షించనున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆరు నెలల వ్యవధిలో రెండోసారి ప్లీనరీ ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి. ఈ ప్లీనరీకి మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు వెరసి మూడు వేల మందిని మాత్రమే పిలిచారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,618 మున్సిపల్‌ డివిజన్లు, వార్డుల్లో జెండా పండుగ నిర్వహించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు జెండా పండుగలో పాల్గొనాలని, గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఉదయం 9 గంటలకు తెలంగాణలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ పతాకావిష్కరణ నిర్వహించాలన్నారు.