MP Bandi Sanjay Arrest (photo-ANI-Twitter)

Dubbaka, Oct 27: తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికల్లో (Dubbaka By-poll Heat) భాగంగా నోట్ల కట్టల వివాదం సోమవారం నుంచి హాట్ టాపిక్ అయిన విషయం విదితమే. బీజేపీ చేసిన పనేనంటూ టీఆర్ఎస్.. కాదు కాదు అంతా టీఆర్ఎస్సే చేసిందంటూ బీజేపీ ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ నేతలయితే.. పోలీసులు టీఆర్ఎస్ (Telangana Rashtra Samithi) కార్యకర్తల్లా ప్రవర్తిస్తూ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ మొత్తం వ్యవహారంపై మీడియా మీట్ నిర్వహించిన పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ (Siddipet police Commissioner Joel Davis) అసలేం జరిగిందో నిశితంగా వివరించారు. పోలీసులపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, పోలీసులే డబ్బు పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నోటీసులు ఇచ్చాకే సోదాలు నిర్వహించామని తెలిపారు. సోదాలపై అధికారులు పంచనామా కూడా నిర్వహించారన్నారు.

దుబ్బాకలో దొరికిన డబ్బులెవరివి? బీజేపీ నాయకులు అడ్డదారిలో వెళుతున్నారని తెలిపిన హరీష్ రావు, సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే అరాచకం నడుస్తుందని మండిపడ్డ బీజేపీ ఎంపీ బండీ సంజయ్

సురభి అంజన్‌రావుకు నోటీసులు ఇచ్చాకే సోదాలు చేశామని, మొత్తం వీడియోలో చిత్రీకరించినట్లు చెప్పారు. బయట నుంచి వచ్చిన కార్యకర్తలు తమపై దాడి చేశారని, ఎన్నికల నియమావళి జిల్లా మొత్తానికి వర్తిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో సీజ్‌ చేసిన డబ్బును ఎత్తుకెళ్లడం నేరమన్నారు. శాంతి భద్రతల నేపథ్యంలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను (Bandi Sanjay) జిల్లాకు రావొద్దని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనకు రక్షణ కల్పించే పంపామని, ఎలాంటి దాడి జరగేదని సీపీ వెల్లడించారు.

Siddipet police Commissioner Joel Davis Press meet:

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్: ఇదిలా ఉంటే సిద్ధిపేట పోలీసుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister of State for Home G Kishan Reddy) సీరియస్ అయ్యారు. నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. సెర్చ్ వారంట్ లేకుండా సివిల్ డ్రస్సుల్లో పోలీసులు ఎందుకు వెళ్లారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. నిన్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి బండి సంజయ్ అరెస్టు వరకు జరిగిన పరిణామాలన్నింటిపై నివేదిక ఇవ్వాలని కిషన్ రెడ్డి డీజీపీకి ఆదేశించారు. అయితే దీనిపై సమాధానం ఇచ్చేందుకు పోలీస్ శాఖ సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

Here's ANI Update: 

బండి సంజయ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్: ఈపరిస్థితులు ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. సంజయ్ అరెస్టుతోపాటు సిద్ధిపేట ఘటనపై ఆయన ఆరా తీశారు. రఘునందన్ రావుకు మద్దతు తెలిపేందుకు దుబ్బాక వెళుతున్న సమయంలో సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్‌కు మద్దతుగా బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

Here's Bandi Sanjay Arrest Video

టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు: బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ నాయకత్వంపై విశ్వాసం తగ్గిపోయి వారంతా బయటకు పోతున్న క్రమంలో బీజేపీ నేతలు సహనం కోల్పోయి మాట్లడుతున్నారని టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రఘునందన్‌ రావు బంధువుల ఇళ్లల్లో పోలీసులు చేసిన సోదాలపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించిన మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరిగినా బీజేపీ నేతలు మారలేదని, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దుబ్బాకలో నిన్నటి నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఆడుతున్న డ్రామా బట్టబయలైందని తెలిపింది. 'ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే' (దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా) అని ఈ వీడియోతో నిరూపితమైందని వెల్లడించింది. ఈ మేరకు పార్టీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

Here's TRS Party Tweet

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్: రాష్ట్ర బీజేపీ తీరుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ‘సోమవారం జరిగిన దుబ్బాక, సిద్దిపేట ఎపిసోడ్ అంతా చూశాం. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సందర్భంగా సోదాలు జరగడం సర్వ సాధారణం. హరీష్‌రావు, పద్మా దేవేందర్ రెడ్డి, సుజాత ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. బీజేపీ నేతలు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ క్యాడర్ బలం ఎంత? మా క్యాడర్ 60 లక్షలు. మీలా మా వాళ్ళు ముట్టడి చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

డబ్బులు సీజ్ చేసి తీసుకొస్తుంటే కార్యకర్తలు పోలీసుల చేతిలో నుంచి లాక్కొని వెళ్లారు. 5 లక్షలు అపహరణకు గురైంది. అది పెద్ద క్రైమ్. దొంగతనం మీరు చేసి మాపై వేస్తున్నారు. ఇది బలుపు కాకపోతే మరెంటి? కేంద్ర మంత్రి నిజానిజాలు తెలుసు కోకుండా అక్కడికి వెళ్లి ఏం చేశారు. హైదరాబాద్‌కు వరదసాయం ఇప్పటికీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి అందలేదు. జీఎస్టీ నిధులే రాలేదు’ అని తలసాని మండిపడ్డారు.

బీజేపీ నేత లక్ష్మణ్: దుబ్బాకలో జరుగుతున్న ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్: అధికార యంత్రాంగం దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు దాసోహమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అక్రమ అరెస్టును తాము ఖండిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట సీపీ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని, ఎన్నికల సంఘం పరిధిలో పని చేయాల్సింది పోయి, టీఆర్‌ఎస్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట సీపీని వెంటనే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి : హరీష్‌రావు ఓటమి భయంతో ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. హరీష్‌రావు ఆటలు సాగనీయమన్నారు. బీజేపీ కార్యకర్తలు డబ్బులు ఎత్తుకెళ్ళలేదు..అవి పోలీస్ వాళ్ళు తెచ్చారని చూపించారని పేర్కొన్నారు. కాగా వీడియోలు చూస్తే పోలీసులే డబ్బులు తెచ్చినట్టు ఉన్నాయని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. కేసీఆర్‌ కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి: బీజేపీకి తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తన బుట్టలోనిదే అని బీజేపీ ఇన్నిరోజులు భావించిందని, బీజేపీలో కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. బండి సంజయ్‌ను మురళీధర్‌రావు, విద్యాసాగర్ రావు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కలెక్టర్, సీపీని పిలిచి సమీక్షించే అధికారం ఉన్నా కిషన్‌రెడ్డి ఆ పనిచేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారణకు ఎందుకు అదేశించలేదన్నారు.

కాంగ్రెస్ నేత విజయశాంతి: దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నేత విజయశాంతి మండిపడ్డారు. దుబ్బాకలో ఎన్నికల కోడ్‌కు ముందే టీఆర్‌ఎస్‌ దుష్ప్రయోగాలు చేస్తుందన్నారు. కొన్నిరోజులుగా టీఆర్‌ఎస్‌ మరింత బరితెగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నిక జరపడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు.