Hyderabad, October 5: తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్‌ఎస్ పార్టీ జాతీయ రాజకీయ పార్టీగా భారత రాష్ట్ర సమితిగా (Bharat Rashtra Samiti) ఆవిర్భవించింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్(భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. జాతీయ పార్టీకి సంబంధించిన పేపర్లపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (Telangana CM K Chandrashekhar Rao) పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు.
నేటి నుంచి టీఆర్‌ఎస్ కనుమరుగు కాగా దాని స్థానంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావించింది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అవతరించింది.2001 జలదృశ్యం సభలో టీఆర్‌ఎస్ అవతరించింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ (Telangana Rashtra Samiti) బీఆర్‌ఎస్‌గా మార్పు చెందుతూ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది.
దేశంలో ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీల ఉనికే లేకుండా చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని.. మరోవైపు కాంగ్రెస్ బలహీనమైందని కేసీఆర్ తరచూ చెప్తున్నారు. ఈ క్రమంలో దేశ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం అవసరమంటున్నారు.తమిళనాడుకు చెందిన ‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ పార్టీ బీఆర్‌ఎస్‌లో విలీనానికి సిద్ధమైంది. కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా బీఆర్‌ఎస్‌తో విలీనమయ్యేందుకు రంగం సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కర్నాకటలో రాబోయే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి జెండా ఎగుర వేయాలని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయిందని, తనకు రాజకీయం ఒక టాస్క్ వంటిదని పేర్కొన్నారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్న కేసీఆర్.. దేశంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు టీఆర్‌ఎస్‌ను రాష్ట్రానికే పరిమితం చేస్తే అని చాలా మంది తనను అడిగినట్లు చెప్పారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని, తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాలని కేసీఆర్ చెప్పారు. బంగ్లాదేశ్‌కంటే వెనుకబడడమేంటని ప్రశ్నించారు. దేశ ప్రజల కోసమే బీఆర్‌ఎస్‌ను తీసుకువచ్చినట్లు వివరించారు. రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు.
విదేశాల నుంచి ప్రాసెసింగ్ ఫుడ్‌ను దిగుమతి చేసుకోవడం దారుణమన్నారు. కర్నాటక, మహారాష్ట్ర మన మొదటి కార్యక్షేత్రాలని తెలిపారు. తొలుత అక్కడి రైతులకు మేలు జరిగేలా మొదట ప్రయత్నిద్దామన్నారు. సమావేశానికి సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌ను రావొద్దని చెప్పామని, ములాయం సింగ్ యాదవ్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు కేసీఆర్. త్వరలోనే అందరూ కలిసి వస్తారని కేసీఆర్ చెప్పారు.
వచ్చే ఏడాదిలో కర్నాటకలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. కర్నాటకలో జెండా ఎగురవేయాలన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ కర్నాటకలో జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు దేశమంతా కేసీఆర్‌తో కలిసి తిరుగుతారని తెలిపారు. తెలంగాణ పథకాలు బాగున్నాయన్న ఆయన.. దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలన్నారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, బీఆర్‌ఎస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నానన్నారు.