Hyd, Mar 7: గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాల (TS Budget Session 2022) ప్రారంభంపై గన్ పార్క్ వద్ద నల్ల కండువాలతో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. 40 - 50 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కి.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (bjp mla etela rajender ) మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికే దిక్కు లేదని... ఎమ్మెల్యేలు ఎంత? అని ఈటల వాపోయారు. స్పీకర్ కుర్చీని అడ్డం పెట్టుకొని తాము మాట్లాడకుండా మైకులు కట్ చేయాలని చూస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లఘించిన కేసీఆర్ కు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదని తెలిపారు.
గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా తాము కొద్ది మందిమే ఉన్న సమయంలో అసెంబ్లీలో (TS Assembly Budget Session) గంటల తరబడి మాట్లాడే అవకాశం కల్పించారన్నారు. ఇప్పుడు తామున్నది ముగ్గురమే కావచ్చని కానీ రాబోయే రోజుల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఈటల పేర్కొన్నారు. దోపిడీ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో గళం విప్పుతామన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే బయట పోరాడుతామని ఈటల పేర్కొన్నారు. బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్ర ప్రజలంతా తమవైపే ఉన్నారని ఈటల తెలిపారు. అన్ని వర్గాల సమస్యలపై ప్రసంగిస్తామన్నారు.
బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ అరాచకాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పకపోతే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు.
బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల గత ఏడాదిగా ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కానీ, గత సెషన్ కొనసాగింపు అని చెబుతున్న ప్రభుత్వం... గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై రాజకీయపరంగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ, కాంగ్రెస్ దీనిపై అభ్యంతరం చెప్పగా... ప్రభుత్వం మాత్రం రాజ్యాంగానికి లోబడి నిబంధనల ప్రకారమే ఈ సెషన్‌లో గవర్నర్ ప్రసంగం లేదని చెప్పింది.