Second Wave in TS: ప్రాణాలు పోతుంటే ఛార్జీలు వసూలు చేసేది అదొక ప్రభుత్వమా? కేంద్రంపై టీఎస్ మంత్రి మండిపాటు; తెలంగాణలో కొత్తగా 8,061 పాజిటివ్ కేసులు నమోదు
Telangana Health Minister Eatala Rajender | File Photo

Hyderabad, April 28: తెలంగాణలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న వేళ, అందుకనుగుణంగా రోగుల చికిత్స కోసం అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఒక వారం వ్యవధిలో, తెలంగాణ వ్యాప్తంగా 3,010 కొత్త ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతాని ఆక్సిజన్ కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. 10,000 పడకల ఆక్సిజన్ డిమాండ్‌ను తీర్చడానికి తగినంత స్టాక్ ఉంది. రాష్ట్రానికి రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం, కానీ ప్రభుత్వం రోజుకు 400 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రభుత్వం సమకూర్చుకుంది అని మంత్రి ఈటల వెల్లడించారు.

ఇక వ్యాక్సిన్ ధరల పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి ఈటల విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో వ్యాక్సిన్ డోసును రూ.600కు అమ్మటాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే, ఇలాంటి ఆపత్కాలంలో వ్యాపార ధోరణిలో ఆలోచించే ప్రభుత్వం అసలు ప్రభుత్వమే కాదని ఆయన మండిపడ్డారు. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తి, తలుచుకుంటే తమ దేశ ప్రజల కోసం ఎంతో చేయొచ్చు. మరోవైపు ఇతర దేశాలు కూడా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటప్పుడు ఏకపక్షంగా వ్యాక్సిన్ ధరలు నిర్ణయించడం సంకుచిత భావమే అని ఈటల రాజేంధర్ అన్నారు. ప్రభుత్వం వద్ద ఉండేది ప్రజల డబ్బేనని ఆయన గుర్తు చేశారు. వ్యాక్సిన్ ధరలపై కేంద్ర ప్రభుత్వం పున:సమీక్షించుకోవాలని ఆయన సూచించారు.

పనిలోపనిగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలపై కూడా మంత్రి ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని మంత్రి అన్నారు. దీనిని సమాజం హర్షించదని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం కాకుండా ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈటల హెచ్చరించారు.

ఇక, రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 82,270 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 8,061 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం ఇంకా 5,241 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,19,966కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,508 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 673 కేసులు, రంగారెడ్డి నుంచి 514 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 56 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,150కు పెరిగింది.

అలాగే మంగళవారం సాయంత్రం వరకు మరో 5,093 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,45,683 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 72,133 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 55 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.