Hyd, Nov 16: టిఎస్‌బీపాస్ వెబ్‌సైట్‌ను హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ నుంచి మంత్రి కెటిఆర్ (Minister KTR Inaugurated TS-bPASS Website) ఈ రోజు ప్రారంభించారు. దీంతో నేటి నుంచి ఈ వెబ్‌సైట్ (TS-bPASS Website) అందుబాటులోకి రానుంది. ఈ వెబ్‌సైట్ ను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
దీని ద్వారా పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతులు సులభతరం కానున్నాయి.ఈ సందర్భంగా మంత్రి (Minister KTR) మాట్లాడుతూ.. ధరణి, టిఎస్ ఐపాస్ మాదిరిగా టీఎస్ బీపాస్‌ను సీఎం కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారన్నారు. 75 గజాల వరకు ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపారు. అనుమతి కాగితమే ఆయుధమని, 600 చదరపు గజాలలోపు ఉన్న స్థలాలు ఉన్న వారికి స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి ఇస్తామని తెలిపారు. 600 గజాలపైన ఉన్న వారికి 21 రోజుల్లో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో 58 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటుందని తెలిపారు. పట్టణాల్లో మౌలిక వసతులపై తాము దృష్టి పెట్టామని చెప్పారు. పరిపాలనను వికేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతోందని తెలిపారు. ఇలాంటి పారదర్శకమైన విధానం దేశంలో ఎక్కడా లేదని, రాబోయే రోజుల్లో కొత్త జీహెచ్‌ఎంసీ చట్టాలు తీసుకువస్తామన్నారు. ఈ చట్టాలు కొంత కఠినంగా ఉంటాయని తెలిపారు.
దశాబ్దాల నుంచి దశల జరిగిన తప్పిదాలతో వర్షాలతో నగర ప్రజలు ఇబ్బంది పడ్డారని, స్వీయ ధ్రువీకరణలో తప్పులు ఉంటే.. ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చే అధికారం అధికారులకు ఉందని స్పష్టం చేశారు. చెరువుల్లో, ఎఫ్‌టీఎఫ్ స్థలాల్లో ఉన్న భవనాలు కూల్చేందుకు కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం తెస్తామన్నారు. రాబోయే 5 నుంచి 7 ఏడేళ్లలో తెలంగాణలో 51 శాతం ప్రజలు నగరాల్లో జీవించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 40 శాతం జనాభా ఓఆర్‌ఆర్ లోపల జీవనం సాగిస్తున్నారన్నారు.
రియల్ ఎస్టేట్ ధరలు పెంచవద్దని మంత్రి హెచ్చరించారు. ఇక నుంచి ఇంటి నిర్మాణ అనుమతులు పారదర్శకంగా, ఆన్‌లైన్ విధానంలో లభ్యం కానున్నట్లు తెలిపారు. తెలంగాణలో 140 మండలాలు పెరిగాయని, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్లు త్వరగా ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా వికేంద్రీకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 70కి పైగా సాహసాలు చేశారని పేర్కొన్న కేటీఆర్ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత పారదర్శకంగా, వేగంగా సామాన్యులకు సేవలు అందుతున్నాయన్నారు. తెలంగాణ తెచ్చిన చట్టాలు దేశానికి బెంచ్ మార్క్‌గా నిలుస్తాయని తెలిపారు. రైతు బంధు కేంద్రం కూడా అనుసరిస్తుందని పేర్కొన్నారు.