KTR on TSPSC Leak: టీఎస్‌పీఎస్సీ లీక్‌ పాపం బీజేపీదే! యువతను రెచ్చగొడుతున్న బండి సంజయ్‌కు బుద్ది చెప్పాలన్న మంత్రి కేటీఆర్, గుజరాత్‌లోనూ ప్రశ్నాపత్రాలు లీకైతే మోదీ రాజీనామా చేశారా? అంటూ ప్రశ్నించిన కేటీఆర్
Telangana IT Minister KTR (PIC @ FB)

Hyderabad, March 17: బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)లో లీకేజీ కేసు, దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్ లో (Gujrat) 13 సార్లు క్వశ్చన్ పేపర్లు లీకు అయ్యాయని తెలిపారు. మరి ప్రధాని మోదీని (Modi) రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్ కు ఉందా? అని నిలదీశారు. నిరుద్యోగ యువకుల ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రభుత్వం లక్ష్యమని కేటీఆర్ చెప్పారు. ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను టీఎస్‌పీఎస్సీకి అందిస్తామని తెలిపారు. రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా, ఉద్యోగాల సాధన పైనే యువత దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC) రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అని అన్నారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రభుత్వ శాఖ కాదని కేటీఆర్ చెప్పారు. ఈ కనీస అవగాహన కూడా బండి సంజయ్ కి లేదని విమర్శించారు. బండి సంజయ్ అజ్ఞాని అని అన్నారు. ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి అవగాహనలేని నాయకుడు బండి సంజయ్ అని కేటీఆర్ మండిపడ్డారు. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలను చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. తమ పార్టీ ప్రయోజనాల కోసం, యువత ఉద్యోగాల ప్రిపరేషన్ పక్కన పడేయాలన్న దుర్మార్గుడు బండి సంజయ్ (Bandi sanjay) అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్ల తమ నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదని చెప్పారు.

TSPSC Paper Leak: బండి సంజయ్‌, ఈటల రాజేందర్ అరెస్టు, గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద తీవ్ర ఉద్రిక్తత 

ఇక టీఎస్‌పీఎస్సీ( TSPSC ) ప్ర‌శ్నాప‌త్రాలు లీక్ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీ( BJP )దే అని మంత్రి కేటీఆర్( KTR ) పేర్కొన్నారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలనే విషయం విచారణలో తేలిందని, తన రాజకీయాల కోసం లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి పేపర్‌ను లీక్ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీదే అని కేటీఆర్ అన్నారు. శరవేగంగా చేపట్టిన నియామక ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే బీజేపీ ఇంత దుర్మార్గానికి, నీచానికి పాల్పడినట్టు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇలా రాజకీయాల కోసం యువత భవితతో ఆడుకుంటున్న బండి సంజయ్ వంటి మోసగాళ్ల పట్ల రాష్ట్రంలోని యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.

Group 1 Prelims Cancelled: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దు, అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ 

ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లపై కోటి ఆశలతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుంటే.. వారిని పరీక్షలు పక్కన పడేసి తనతో కలిసి రావాలన్న దగుల్బాజీ నాయకుడు బండి సంజయ్‌కు అసలు యువత గురించి మాట్లాడే అర్హత లేదని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లను విడుదల చేస్తే తమ పార్టీకి యువకులను దూరం చేసే కుట్ర అన్న దుర్మార్గుడు బండి సంజయ్ వ్యాఖ్యలను రాష్ట్ర యువత మర్చిపోలేదన్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పును బూచిగా చూపించి మొత్తం పబ్లిక్ సర్వీసు కమిషన్ నే రద్దుచేయాలన్న అడ్డగోలు వాదన వెనక యువతను ఉద్యోగాలకు దూరం చేయాలన్న కుట్ర దాగి ఉందని కేటీఆర్ మండిపడ్డారు.