TSRTC Strike: చర్చలు విఫలం..మోగిన సమ్మెసైరన్, సమ్మెలో పాల్గొంటే డిస్మిస్ తప్పదు, అన్ని డిపోల అధికారులకు నోటీసులు జారీ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, పోరాటానికి సిద్ధం కావాలంటున్న ఆర్టీసీ సంఘాల నేతలు, సామాన్యులకు తప్పని తిప్పలు
TSRTC strike on 5th October 2019: government gets ready for plan B

Hyderabad,October 4:  ఆర్టీసీ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ 26 డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్, రామకృష్ణారావు, సునీల్ శర్మ నేతృత్వంలో గత కొద్ది రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సహా ప్రధాన డిమాండ్లపై కార్మిక సంఘం నేతలు వెనక్కి తగ్గలేదు. అయితే ఈ డిమాండ్లపై చర్చలు ఒ కొలిక్కి రాకపోవడంతో సమ్మెకు కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. ఆర్టీసీని బతికించడానికి జరుగుతున్న పోరాటం ఇదని, ఆర్టీసీని ప్రభుత్వమే కాపాడాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. ప్రభుత్వానికి కార్మికుల సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేదని, నోటీసులకు ఆర్టీసీ కార్మికులు భయపడరని, సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. గతంలో ప్రభుత్వం వేసిన కమిటీ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వెనక్కు తగ్గేది లేదని ఆయన అన్నారు

ఇదిలా ఉంటే... ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పందించారు. సమ్మె చట్ట విరుద్ధం అని, సమ్మెలో ఉద్యోగులు పాల్గొంటే డిస్మిస్‌ చేస్తామని స్పష్టమైన హెచ్చరిక చేశారు.ఈమేరకు అన్ని డిపోల అధికారులకు నోటీసు జారీ చేశారు. కార్మికులందరూ సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. విధులకు రాకుండా సమ్మెలో పాల్గొంటే వేటు తప్పదన్నారు. అవసరమైతే ఎస్మాను ప్రయోగిస్తామని తేల్చి చెప్పారు. కాగా సమ్మె వైపుగా ఆర్టీసీ కార్మికులు అడుగులు వేస్తుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తొలగించిన ఉద్యోగుల స్థానంలో తాత్కాలిక ఉద్యోగులను తీసుకొంటామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటుగా ప్రైవేట్ బస్సులు, డ్రైవర్లతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సులను నడిపేందుకు గాను తాత్కాలికంగా రెండు వేల మందిని విధుల్లోకి తీసుకొంటామని కూడ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు. ఆర్టీసీ బస్సులను పోలీస్ భద్రతతో నడిపిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పారు. సమ్మెకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, 2100 ప్రైవేట్ బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 20 వేల స్కూల్ బస్సులకు పర్మిట్లు ఇచ్చి పొలీస్ బందోబస్తు మధ్య వాటన్నింటినీ నడుపుతామన్నారు. సమ్మె ప్రభావం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.

కాగా కార్మికుల డిమాండ్లన్నీ నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అధ్యయనానికి వారం రోజుల సమయం ఇవ్వాలని త్రిసభ్య కమిటీ కోరింది. దసరా పండగ వేళ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని.. అందువల్ల ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను వాయిదా వేసుకోవాలని త్రిసభ్య కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఐఏఎస్ ఆధికారి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఒకవేళ సమ్మెకు వెళ్తే ప్రత్యామ్నాయ మార్గాలపై ఆర్టీసీ అధికారులు దృష్టి పెడతారని స్పష్టం చేశారు. అందరికీ న్యాయం జరిగేలా రిపోర్ట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని.. ఇప్పటికిప్పుడు అంటే నివేదిక సరిగా ఇవ్వలేమని కమిటీ తెలిపింది. అయితే కార్మిక సంఘాలను ఈ నిర్ణయం సంతృప్తి పరచలేదు.  డిమాండ్లు తీర్చాలంటూ సమ్మె వైపు అడుగులు వేస్తున్నారు.

దసరా ఓ వైపు మరో వైపు సమ్మె ప్రభావం ప్రయాణికులను కొత్త కష్టాల్లో పడేస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచే నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సమ్మెను సాకుగా చూపించి ప్రైవేట్ ట్రావెల్స్ అందింనకాడికి దోచుకుంటున్నాయి. టికెట్ రేట్లను అమాంతం పెంచేశాయి. దీంతో ప్రభుత్వానికి, ఆర్టీసీకి మధ్య నలిగిపోక తప్పదని సామాన్య ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ దసరా, దీపావళి నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఇబ్బడిముబ్బడిగా టికెట్ ధరలు పెంచాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరింత బాదుడు తప్పదేమోనని ప్రయాణికులు భయపడుతున్నారు.

ఆర్టీసీ జేఎసీ సమ్మెకు పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 10,395 బస్సులు, 2వేల స్పెషల్ బస్సులు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీ సమ్మెలో సుమారు 57 వేల మంది కార్మికులు పాల్గొననున్నారు.