Hyderabad, April 3: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేయడం లేదనే మనస్తాపంతో కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు తాగిన విద్యార్థి బోడ సునీల్ నాయక్(25) చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి (Sunil Nayak Dies) చెందారు. గత నెల 26న కాకతీయ యూనివర్సిటీ క్రీడా మైదానంలో (Kakatiya University campus) సునీల్ ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పటి నుంచి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అతని మరణ వార్త తెలియగానే నిరసనలు భగ్గుమన్నాయి. ఇది ప్రభుత్వం చేసిన హత్యేనంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ పార్టీలు, ప్రజా,విద్యార్థి సంఘాలు శుక్రవారం ఆందోళనకు దిగాయి. సునీల్ (unemployed youth Sunil Nayak) మరణ వార్త విన్న పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల రాకతో తండా అట్టుడికింది. కాగా సునీల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రాంసింగ్ తండా. మృతుడి కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి జెన్‌కోలో ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్‌తో విపక్షాలు, వివిధ సంఘాల నాయకులు రోడ్డుపైన బైఠాయించి ఆందోళన కొనసాగించారు.
నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని రాంసింగ్‌తండాకు తెస్తుండగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్, ఎంసీపీఐ (యూ) పార్టీ నేతల ఆధ్వర్యంలో మెరుపు ధర్నాకు దిగారు. అంబులెన్సును కదలనివ్వకుండా ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు బీజేపీ నేతలు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, బీఎల్‌ఎఫ్, ఎంసీపీఐ (యూ) నేతలు బైఠాయించారు. దీంతో ఎస్పీ కోటిరెడ్డి ఆందోళనకారులతో చర్చలు జరిపారు.
మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. సునీల్ కుటుంబానికి సత్యవతి రాథోడ్ తరఫున.. గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగం, అంత్యక్రియలకు తక్షణ సాయంగా రూ.లక్ష, ఎంపీ మాలోతు కవిత తరఫున రూ.4 లక్షల ఆర్థిక సాయం, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తరఫున డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇస్తామన్న హామీలను ధర్నాలో వెల్లడించారు. కాగా, సునీల్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వస్తున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కేసముద్రం మండలం అర్పనపల్లి సమీపంలో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.
అంత్యక్రియలు పూర్తి
కేయూ విద్యార్థి బోడ సునీల్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. గూడూరు మండలం రామ్‌సింగ్ తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. భారీ సంఖ్యలో విద్యార్థి సంఘాల నాయకులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయకులు తెలంగాణ అమరుల గీతాలను ఆలపించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సునీల్ నాయక్ ఆత్మహత్యకు నిరసనగా బీజేవైఎం ఆందోళనకు దిగింది. బారికేడ్లను తోసుకుని కార్యకర్తలు గేట్ ఎక్కే ప్రయత్నం చేశారు. సునీల్‌నాయక్ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించే వరకు ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. సునీల్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీజేవైఎం నేతలు ఆరోపించారు.
ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఆత్మహత్యకు పాల్పడిన కేయూ విద్యార్థి సునీల్‌నాయక్ మృతి చెందడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్య అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణలో ఇక ఉద్యోగాలు రావని, పోరాటం చేయాలని, తాను బతికి వస్తే మీతో కలుస్తానని సునీల్ నాయక్ పిలుపునివ్వడం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి పరాకాష్ట అని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటి ముట్టడి
హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశా యి. ఇంటి ఆవరణలోని సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు ఇంటిపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగం రాలేదన్న బాధ, ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడిన కాకతీయ వర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. సునీల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబానికి సునీల్ లేని లోటు తీర్చలేనిదని, వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పారు.
ఐదేళ్లుగా పోలీసు ఉద్యోగం కోసం ప్రయ త్నం
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సమీపంలోని తేజావత్ రాంసింగ్ తండాకు చెం దిన సునీల్ డిగ్రీ చదివాడు. ఐదేళ్లుగా పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 2016లో నిర్వహించిన పోలీస్ ఉద్యోగ నియామకాల్లో అర్హత సాధించి దారుఢ్య పరీక్షల్లో రాణించలేకపోయాడు. ప్రస్తుతం హన్మకొండలో పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నాడు.
Here's Konda Vishweshwar Reddy Tweet
Is lakhs of crores for infra projects more important?
OR employment opportunities for rural youth?
KCR's lies and deciet takes the life of one more unemployed youth.
Sunil Nayak of died in NIMS hospital.
My deepest condolences to the family. May God give them strength. pic.twitter.com/H9zdsMbJuM
— Konda Vishweshwar Reddy (@KVishReddy) April 2, 2021
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ప్రభుత్వం ఇక ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయదన్న మనస్తాపంతో గత నెల 26న కేయూ క్రీడా మైదానంలో పురుగుల మందు తాగాడు. ‘నేను చేతకాక చావడం లేదు.. నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలి’ అని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులు వెంటనే అతడిని ఎంజీఎం ఆస్పత్రికి.. పరిస్థితి ఆందోళనకరంగా మారడటంతో నిమ్స్‌కు తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి : బండి సంజయ్
సునీల్ తీసుకున్న సెల్ఫీ వీడియోను మరణవాంగ్మూలంగా స్వీకరించి, అందుకు కారణమైన సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గాంధీ మార్చురీ వద్ద మృతుని కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడు వివేక్‌తో కలసి మీడియాతో మాట్లాడారు.
సునీల్ ఆత్మహత్యాయత్నానికి ముందు తీసుకున్న వీడియోలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతోనే మనస్తాపం చెందానని, తన మృతికి సీఎం కేసీఆర్ కారణమని స్పష్టంగా చెప్పాడని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయని.. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని, కేసీఆర్ ఉద్యోగం ఊడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సెల్ఫీ వీడియో సారాంశం
మిత్రులందరికీ నమస్కారం.. ఫ్రెండ్స్.. నేను చేతకాక చనిపోవడం లేదు. రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు నా లెక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు.. నేను పాయిజన్ తీసుకున్నా. తెలంగాణలో ఉద్యోగాలు లేవు.. నోటిఫికేషన్లు లేవు. గత ఐదేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నా.. నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సినోడిని.. ఇలా చనిపోతున్నా. విద్యార్థుల్లారా.. మీరు కేసీఆర్‌ను విడిచిపెట్టకండి.. అసలే విడిచిపెట్టకండి,’