Hyderabad, NOV 03:హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇంటి దగ్గర అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇంటి దగ్గర తిరుగుతున్నారని, పవన్ ను అనుసరిస్తున్నారని, పవన్ వాహనాలను ఫాలో అవుతున్నారని వారు చెబుతున్నారు. దీనిపై జనసేన నేతలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు (Unidentified persons) రెండు రోజులుగా పవన్ ఇంటి దగ్గర రెక్కీ చేస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్ లేని కారులో పవన్ ను ఫాలో అవుతున్నారని జనసేన నేతలు (Janasena) పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఓ పార్టీ నుంచి తమ పార్టీ అధినేతకు ప్రాణహాని ఉందని జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ”
విశాఖ పరిణామాల తర్వాత పవన్ కల్యాణ్ నివాసం, కార్యాలయం దగ్గర కొత్త వ్యక్తులు తిరుగాడుతున్నారు. పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయటికి వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడిస్తున్నాయి. ఆ వాహనాల్లోని వ్యక్తులు పవన్ కల్యాణ్ కారును నిశితంగా పరిశీలిస్తున్నారు. వారు అభిమానులు కారని పవన్ కల్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా చెబుతున్నారు. నిన్న కారులోనూ, ఇవాళ బైకులపైనా పవన్ వాహనాన్ని అనుసరించారు.
అంతకుముందు, సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చి పవన్ ఇంటి దగ్గర గొడవ చేశారు. పవన్ ఇంటి ఎదురుగా వారు కారు నిలపగా, సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోబోయారు. దాంతో వారు బూతులు తిట్టడం మొదలుపెట్టారు. పవన్ కల్యాణ్ ను దూషించారు. సెక్యూరిటీ సిబ్బందిని వారు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ సిబ్బంది సంయమనం పాటించి ఆ ఘటనను వీడియో తీశారు” అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు చేసిన గొడవకు సంబంధించిన వీడియోను జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్ కు అందించగా, ఆయన జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారని నాదెండ్ల తెలిపారు.