Telangana's Health Report: తెలంగాణలో ఒక వైపు కరోనా మహమ్మారి, మరోవైపు ఆసుపత్రుల్లో పెరుగుతున్న వైరల్ ఫీవర్ కేసులు, అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు; రాష్ట్రంలో కొత్తగా 582 కోవిడ్ కేసులు నమోదు
COVID 19 Testing (Photo Credits: Pixabay)

Hyderabad, August 5: కోవిడ్ సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకముందే థర్డ్ వేవ్ ఉండవచ్చనే సంకేతాలు ఉన్నాయి. దీనికి తోడు సీజనల్ వ్యాధులు తోడవుతున్నాయి. ఇటీవల కాలంగా ఆసుపత్రుల్లో డెంగ్యూ, మలేరియాతో పాటు ఇతర వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఆసుపత్రుల్లో చేరుతున్న వారికి అధిక గ్రేడ్ జ్వరం, ఒళ్ళు నొప్పులు, దద్దుర్లు, నడుము నొప్పి, ముక్కునుంచి రక్తస్రావం, ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం. బీపి తగ్గడం వంటి లక్షణాలు అధికంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు.

రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 20,000 కంటే తక్కువగా ఉండి రోజురోజుకి మరింత క్షీణిస్తూ ఉంటే ప్లేట్‌లెట్ మార్పిడి అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రోగికి 80,000 నుంచు 1,00,000 వరకు ప్లేట్‌లెట్ కౌంట్ ఉన్నప్పటికీ లేదా రోజురోజుకి క్రమంగా ప్లేట్‌లెట్ కౌంట్ మెరుగుపడుతున్నా అనవసరంగా రక్త మార్పిడిని సూచిస్తున్నారని హైదరాబాద్ లోని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. శంకర్ చెప్పారు.

డెంగ్యూ ఒక వైరస్ వల్ల వస్తుంది, ఇది ఏడిస్ ఈజిప్టి దోమ ద్వారా వ్యాపిస్తుంది. మలేరియాకు కారణమయ్యే క్యూలెక్స్ దోమలా కాకుండా, ఏడిస్ అనేది పగటిపూట కుట్టడం ద్వారా వస్తుంది. వర్షపు నీరు, కొలనులు, కూలర్లు, టైర్లు, కొబ్బరి చిప్పలు మొదలైన చోట్ల స్వచ్ఛమైన నీటి నిల్వలలో దోమలు వెంటనే అభివృద్ధి చెందుతాయి. కాబట్టి పగలైనా, రాత్రైనా దోమ కాటు బారిన పడకుండా, ఈ కరోనా కాలంలో అనవసరంగా ఆసుపత్రుల పాలు కావొద్దని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాస్ రావు తెలిపారు.

ఇక, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,07,329 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 582 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1459 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,47,811కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 83 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 61, వరంగల్ అర్బన్ నుంచి 61 మరియు ఖమ్మం జిల్లా నుంచి 45 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,817కు పెరిగింది. అలాగే సాయంత్రం వరకు మరో 638 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,35,250 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,744 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.