ప్రముఖ మీడియా దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. నగరంలో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సెంటర్(ఐడీసీ)ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం న్యూయార్క్‌లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ ఫైనాన్స్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షురాలు అలెగ్జాండ్రా కార్టర్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగాభివృద్ధి, ఆవిష్కరణల విషయంలో ఇరువర్గాలు ఒకే విధమైన ఆశయాలను కలిగి ఉన్నట్టు..హైదరాబాద్‌లో ఈ రంగాల ఉజ్వల భవిష్యత్‌కి కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రస్తుతం టెలివిజన్, సినిమా, స్ట్రీమింగ్, గేమింగ్ వంటి రంగాల్లో దూసుకుపోతోంది. హెచ్‌బీఓ, హెచ్‌బీఓ మ్యాక్స్, సీఎన్‌ఎన్, టీఎల్‌సీ, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, ఈరోస్పోర్ట్, అనిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, నిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్‌జీటీవీ, క్వెస్ట్ వంటి ఎంటర్‌టైన్మెంట్ ఛానళ్లు ప్రస్తుతం సంస్థ కింద పనిచేస్తున్నాయి. హైదారాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా భారతీయ మార్కెట్‌లోని అపార వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు నగర మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగాలపై తనదైన ముద్ర వేయాలని వార్నర్ బద్రర్స్ డిస్కవరీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.