Weather Forecast: తెలంగాణలో ఏప్రిల్ 2 వరకు ఎండలే ఎండలు, బయట తిరగవద్దని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటన, 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
Representative (Image: Credits: PTI)

Hyd, Mar 30: తెలంగాణలో ఏప్రిల్ 2 వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. ఈసారి ‘అంతకు మించి’ అన్నట్టుగా సూర్యుడి ప్రతాపం (Weather Forecast) ఉండబోతోందని.. ముఖ్యంగా రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ( Heatwave warning) నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా.. 41-45 డిగ్రీల దాకా నమోదవుతాయని అధికారులు వెల్లడించారు.

సోమవారం ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. హైదరాబాద్‌లో 39 డిగ్రీలకు చేరడం గమనార్హం. ఇక.. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మంగళవారంనాడు 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ ప్రకటించింది. బుధవారం నుంచి ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, పెద్దపల్లి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, జోగులాంబ గద్వా ల జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడిచింది.

ఎండలు బాబోయ్ ఎండలు, తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వడగాడ్పులు, తెలంగాణలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం

ఆ తర్వాత మూడు రోజులు.. వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ, సూర్యాపేట, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, పెద్దపల్లి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే ఈసారి రాష్ట్రంలో ‘కాలా బైశాఖీ’ల ప్రభావం కూడా ఎక్కువగానే ఉండబోతోందని సమాచారం. క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఎండాకాలంలో కురుస్తుంటాయి. వీటిని వాతావరణ శాఖ అధికారులు ‘కాలా బైశాఖీ’లుగా వ్యవహరిస్తుంటారు. విపరీతంగా ఎండ కాయడం.. ఆ తర్వాత కొద్దిగంటలకే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడడం వీటి లక్షణంగా చెబుతారు.