Hyd, April 29: విపరీతమైన ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. మరో మూడ్రోజులు (Next three days will Continue) రాష్ట్రంలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాముందని (Weather Forecast) వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ (Telangana), ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందన్నారు. దాని ప్రభావంతో చిరజల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
అకాల వర్షాలు (Premature rains) తెలంగాణాలోని పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. భీకరమైన ఈదురు గాలులకు వర్షం తోడవడంతో పలు చోట్ల పంట, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి వాహనాలు దెబ్బతిన్నాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగండ్ల వానకు ధాన్యం తడిసిముద్దైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన పంట..వర్షానికి పూర్తిగా తడిసిపోయి…రైతుల కంట కన్నీరు తెప్పించింది.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భీకరమైన ఈదురు గాలుల ప్రభావానికి పెద్దపెద్ద చెట్లు కూలిపోయాయి. ఈ ఘటనలో బస్టాండ్ ఆవరణలో చెట్ల కింద పార్క్ చేసిన నాలుగు వాహనాలు ధ్వంసం అయ్యాయి. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్‌లో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలుల ధాటికి స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలోని ధ్వజ స్తంభం కూలిపోగా, ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామ శివారులో గొర్రెలు మేపుతున్న నవీన్ అనే కాపరి గాయపడ్డాడు. జగిత్యాల జిల్లాలో గొల్లపల్లి రోడ్డులో దీప్తి కంటి ఆస్పత్రి ఎదురుగా ఉన్న చెట్టు కూలడంతో దాని కింద ఉన్న ఆటో పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎల్లారెడ్డి, తంగళ్లపల్లి మండలాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈదురుగాలులకు బాబు బస్తీలోని ఓ ఇంటిపై చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.