Heavy Rains (Photo-Twitter)

కుండపోత వర్షాలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీ చిగురుటాకులా వణుకుతోంది. వాయుగుండం ప్రభావంతో మంగళవారం నగరంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. సోమవారం కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు చెరువులను తలపించగా..మళ్లీ కురిసిన వర్షంతో (Hyderabad Weather Report) లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు అవస్థలు పడ్డారు. బల్దియా సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారింది.

రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలుండడంతో నగరంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టంచేసింది. విపత్తుస్పందనా దళం, బల్దియా, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కాగా మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు సులేమాన్‌ నగర్‌లో 1.4 సెంటీమీటర్లు, మాదాపూర్, బోరబండ, చర్లపల్లి, శ్రీనగర్‌ కాలనీల్లో అరసెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది.

గులాబ్ మరచిపోకముందే మరో అల్పపీడనం, రాగల 48 గంటల్లో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం, గులాబ్‌ తుపాను నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌ పరిధిలోని మూడు లక్షల మ్యాన్‌హోల్‌ మూతలను ఎట్టి పరిస్థితుల్లో తెరవరాదని జీహెచ్‌ఎంసీ, జలమండలి హెచ్చరించాయి. గ్రేటర్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో, పురాతన భవనాల్లో నివాసం ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. పోలీస్, జలమండలి, విద్యుత్, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పరిస్థితిని సమీక్షించాయి.