Hyderabad, Nov 25: చలితో యావత్తు తెలంగాణ (Telangana) గజగజలాడుతున్నది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. ఉదయం పొగమంచు ఊపిరి ఆడనివ్వటం లేదు. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే దిగువకు ఉష్ణోగ్రతలు (Temperatures) పడిపోతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. భద్రాచలం, హకీంపేట, ఖమ్మం, రామగుండం, పటాన్ చెరు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నట్టు తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 14 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వానలు లేనట్టే
హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. తెలంగాణకు మాత్రం వర్ష సూచన లేదని, పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు.
తొలిరోజు ఐపీఎల్ ఆక్షన్ లో ఏ జట్లు ఏ ప్లేయర్ ను కొనుగోలు చేశాయంటే? ఫుల్ లిస్ట్ ఇదుగోండి