Hyd, June 3 ;తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Weather Update) నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు(Telugu States to record highest temperature) నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న రెండ్రోజులు ఇదేస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వెల్లడించింది.కాగా, నైరుతి రుతుపవనాలు వాయవ్య బంగాళాఖాతం లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని అనేక ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటించింది. 83 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 157 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.
శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46ని– 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని జిల్లాల్లో 43ని నుంచి 45, మరికొన్ని జిల్లాల్లో 40–42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఈ మూడు రోజులు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వడదెబ్బ తగలకుండా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్), లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తెలిపారు.