Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, April 27:  తెలంగాణలో కోవిడ్-19 కేసులు వెయ్యి దాటాయి. అయినప్పటికీ గతంలో కంటే ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువగా వస్తుండటం కొంత ఊరట కలిగించే విషయం. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అయితే ఇవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే వచ్చినవి. జిల్లాల నుంచి ఒక్క కేసు కూడా కొత్తగా నమోదు కాలేదు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య సోమవారం ఉదయం నాటికి 1001కి చేరింది.

అలాగే కొత్తగా కరోనా మరణాలేమి లేకపోగా, శనివారం మరో 9 మంది కోవిడ్-19 బాధితులు కోలుకొని గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 316 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 660 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి

status of positive cases of #COVID19 in Telangana.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి 540 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు కేంద్ర బృందం ప్రత్యేకంగా గత 3 రోజులుగా నగరంలో పర్యటిస్తుంది. ఈరోజు కూడా వారి పర్యటన సాగి, ఈ సాయంత్రానికి తిరిగి దిల్లీ వెళ్లిపోనున్నారు.

ఏదైమైనా జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో గత ఐదు రోజులుగా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవడంతో సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరింత కాలం లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని ప్రజలను కోరారు. ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఉంది, దీని తర్వాత లాక్డౌన్ పై మరింత స్పష్టతవచ్చే అవకాశం ఉందని సీఎం చెప్పారు.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీ అవతరించి నేటికి 20 ఏళ్లు పూర్తయింది. లాక్డౌన్ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ సభలను నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.