Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, May 1: తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా తగ్గుకుంటూ వచ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో స్వల్పంగా పెరిగింది. గురువారం సాయంత్రం నాటికి కొత్తగా మరో 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 1038 కి చేరింది. నిన్న ఒక్కరోజే మరో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరికి కరోనాతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.

అయితే, కొత్తగా వచ్చిన ఈ 22 పాజిటివ్ కేసులు మరియు 3 మరణాలు మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. నగరంలోని రామాంతపూర్‌కు చెందిన ఓ 48 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలో చేరిన 12 గంటల్లోనే చనిపోయాడని, వనస్థలిపురంకు చెందిన 76ఏళ్ల వృద్ధుడు కూడా ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోనే చనిపోగా, జియాగూడకు చెందిన 44 ఏళ్ల మహిళ ఇంతకాలం వెంటిలెటర్‌పై చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. కాగా.. ఈ ముగ్గురి మరణాలతో తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 బారినపడి చనిపోయినవారి సంఖ్య 28కి పెరిగింది.

Media bulletin on COVID-19 in Telangana:

Status of positive cases of #COVID19 in Telangana

 

మరోవైపు, ఈ కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా స్థిరంగా మెరగవుతోంది. గురువారం మరో 33 కోవిడ్-19 బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తంగా ఇప్పటివరకు 442 మంది కోవిడ్ బాధితులు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 568 ఆక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.   దేశ చరిత్రలోనే తొలికేసు, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కోవిడ్-19ను జయించిన 45 రోజుల పసిబిడ్డ 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా..

రాష్ట్రంలో గత వారం రోజులుగా తగ్గుకుంటూ వచ్చిన కోవిడ్ -19 కేసులు గురువారం అకస్మాత్తుగా పెరగడంతో సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ అధికారుల వద్ద ఆరా తీశారు. ఒకవైపు జిల్లాల్లో కొత్త కేసులు ఏమీ లేకుండా ఉన్న కేసులు కూడా తగ్గుకుంటూ పోతుండగా, హైదరాబాద్‌లో మాత్రం వైరస్ వ్యాప్తి కట్టడి కావడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అన్ని కంటైనర్ జోన్లలో లాక్డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.