Hyderabad, September 16: తెలంగాణలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురువారం నుంచి ప్రారంభమైంది. ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లోని పంచాయతి మున్సిపల్ అధికారులు, సర్పంచులు, ఎంపిటీసిలు, జడ్పిటీసిలు, ఎంపిపి, జడ్పీ చైర్ పర్సన్, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు తదితిర ప్రజాప్రతినిధులు క్రీయాశీలకంగా వ్యవహరించాలని, మంత్రులందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయం సాధించాలని, ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్దేశించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఇప్పటివరకు 2 కోట్ల, 56 వేల 159 డోసులు అందించారని వారిలో 1 కోటి 45 లక్షల 19 వేల 909 మొదటి డోసు, 55 లక్షల 36వేల 250 మంది రెండు డోసులు ఇవ్వటం జరిగింది. ఇకపోతే చిన్నపిల్లలకు కరోనా సోకితే ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు వెల్లడించారు. 133 కోట్ల ఖర్చుతో బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యం కొరకు సంబంధించి 5,200 బెడ్లు, ముందస్తు ఎర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు.
ప్రస్తుతం, తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,261 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 259 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,633 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,62,785కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72 కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 1 కోవిడ్ మరణం సంభవించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,900కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 301 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,53,603 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,282 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.