Hyderabad, April 20: తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజూవారీ కోవిడ్ కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరిస్తున్న కరోనాలో వేగంగా వృద్ధి చెందే గుణం ఉన్న SARS-CoV-2 వైరస్ యొక్క N440K వేరియంట్ ప్రబలంగా ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) డైరెక్టర్ డాక్టర్ ఆర్కె మిశ్రా తెలిపారు. ఇటీవల కాలంగా కేసులు వేగంగా పెరుగుతున్న మహారాష్ట్ర, గుజరాత్ మరియు దేశంలోని మరికొన్ని ప్రాంతాలలో ఈ తరహా 'డబుల్ మ్యుటేషన్' కొరోనావైరస్ వేరియంట్లు గుర్తించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు విస్మరించి మాస్కులు లేకుండా తిరగడం వల్లనే కేవలం 2 నెలల్లోనే దేశంలో కేసులు భారీగా పెరిగాయని ఆయన వెల్లడించారు. కేసులు పెరిగే కొద్ది దేశంలో కొత్తకొత్త వేరియంట్ల పుట్టుకకు ఆస్కారం ఇచ్చే అవకాశం ఏర్పడుతుందని, కాబట్టి రాబోయే మూడు వారాలు దేశానికి అత్యంత కీలకం, ప్రజలు మాస్కులు మరియు ఇతర కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని డాక్టర్ మిశ్రా అప్రమత్తం చేశారు.
రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,22,143 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 5,926 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 6,033 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,61,359కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 793 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యాయి. COVID కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిమితుల్లో COVID కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ఇక మేడ్చల్ నుంచి 488 కేసులు, రంగారెడ్డి నుంచి 455, నిజామాబాద్ నుంచి 444 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 18 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,856కు పెరిగింది.
అలాగే సోమవారం సాయంత్రం వరకు మరో 2,209 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,16,650 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42,853 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. కేంద్రం తాజా మార్గదర్శకాల ప్రకారం మే1 నుంచి ప్రారంభమయ్యే మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18 ఏళ్ల పైబడిన అందరికీ టీకాలు వేయనున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 38 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.