
Hyderabad, May 13: తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై కనిపించే ప్రతీ వాహనాన్ని పోలీసులు తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు సొంతూళ్లకు తరలిపోతున్నారు. అయితే ఉదయం 10 గంటలకే లాక్ డౌన్ ప్రారంభం అవుతుండటంతో ఈ కాస్త సమయంలో బస్సులు దొరకని ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మార్కెట్లలో రద్దీ 10 దాటిన తర్వాత కూడా కనిపిస్తున్నారు. రిలాక్సేషన్ 11 గంటల వరకు పొడగించాలని వారు కోరుతున్నారు.
ఇక, లాక్ డౌన్ నేపథ్యంలో నేటి నుంచి బ్యాంకులు మరియు పోస్టాఫీసుల పనివేళల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారం నుంచి బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. లాక్ డౌన్ కొనసాగినన్నీ రోజులు ఇవే పనివేళలు అమలులో ఉండనున్నాయి. అలాగే 50 శాతం సిబ్బందితోనే బ్యాంకులు పనిచేయనున్నాయి.
బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ పనివేళలు కూడా కుదించబడ్డాయి. మేజర్ పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే చిన్న పోస్టాఫీసులు మాత్రం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని పేర్కొంది. తపాళాకు సంబంధించి డెలివరీ మరియు ఇతర సేవల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది.
మరోవైపు, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు మరోసారి నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనల వలన ఈనెల 21వ తేది వరకు మండల కార్యాలయాలలో జాయింట్ సబ్ రిజిస్టార్ లుగా వ్యవహరిస్తున్న తహసిల్ దార్ల వద్ద ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించే భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు జరుగవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ధరణిలో 12.05.2021 నుండి 21.05.2021 తేదిలలో రిజిస్ట్రేషన్ ల కోసం ఇప్పటికే స్లాట్ లు బుక్ చేసుకున్న వారికి వారి స్లాట్ లను రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. స్లాట్ ల బుకింగ్ కై చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర చార్జీలు తర్వాత కూడా చెల్లుబాటు అవుతాయని, రీషెడ్యూల్ సమయంలో వాటిని జమ చేయనున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ నిబందనల మినహాయింపు కార్యక్రమాలలో ధరణీ లావాదేవీలు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. మండల కార్యాలయాలలో రద్దీని నివారించటానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్ వెల్లడించారు.