Hyderabad, Nov 4: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) (TET) కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కీలక పరిణామాలు నేడు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్-2024) ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. మంత్రి నారా లోకేశ్ వీటిని విడుదల చేయనున్నారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2వ తేదీన ఫలితాలు వెల్లడి కావాల్సిఉండగా.. తుది కీ విడుదలలో జాప్యం చోటు చేసుకోవడం వల్ల ఫలితాల వెల్లడి వాయిదా పడింది. కాగా ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 17 రోజుల పాటు నిర్వహించారు. టెట్ కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,68,661 మంది అంటే 86.28% మంది పరీక్షలకు హాజరయ్యారు. టెట్ మార్కులకు డీఎస్సీ పరీక్షలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్ స్కోర్ కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.
నేడు నోటిఫికేషన్
అటు, తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్-2024) నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్.. ఆ మేరకు ఈ ఏడాది రెండో సారి టెట్ పరీక్ష నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది. ఈ ఏడాది ఇచ్చిన తొలి టెట్ నోటిఫికేసన్ కు సంబంధించి మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో టెట్ కు నేడు నోటిఫికేషన్ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని ఆగస్టులో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.