Aarogya Setu App: ప్రధాని మోదీ చెప్పిన యాప్ ఇదే, ఆరోగ్య సేతు యాప్ మీ దగ్గరఉంటే కరోనా పూర్తి వివరాలు మీ చేతుల్లో ఉన్నట్లే, ఎలా వాడాలో తెలుసుకోండి
Aarogya Setu app (Photo Credits: Screenshot)

Mumbai, April 14: కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus Cases) రోజురోజుకీ పెరుగుతుండటం దేశ ప్రజలందరిలో కలవరపెడుతున్న అంశం. ఈ నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై ఓ లెక్క ఉండాలని.. దానిని బట్టే నియంత్రణ చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం (Central Govt) సరికొత్త ఆలోచన చేసింది. కోవిడ్ 19 (COVID-19) దరి చేరకుండా అడ్డుకునేందుకు ఓ యాప్‌ను లాంచ్ చేసింది.

ప్రధాని మోదీ సప్తపది సూత్రాలు

ఎలక్ట్రానిక్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో ‘ఆరోగ్య సేతు’ (Aarogya Setu App) యాప్‌ను ప్రారంభించింది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహకరించడంతో పాటు కోవిడ్‌-19 బారిన మనం పడకుండా అటువంటి వారు మనల్ని సమీపిస్తే మనల్ని ఈ యప్ హెచ్చరిస్తుంది.

డౌన్‌లోడ్‌ ఎలా చేసుకోవాలి

ముందుగా ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐ ఫోన్‌ల కోసం యాప్ స్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత పేరు, మొబైల్‌ నంబర్‌తో రిజిష్టర్‌ చేసుకోవాలి. వీటితోపాటు మన ఆరోగ్య విషయాలను.. ఇతర వివరాలను నమోదు చేయాలి. ట్రాకింగ్‌ను ప్రారంభించడం కోసం ఫోన్‌లో జీపీఎస్‌, బ్లూ టూత్‌ సిస్టమ్‌ను ఆన్‌లో ఉంచాలి.

మే 3 వరకు ఇళ్ళల్లోనే

ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్‌ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో మీ సమాచారమంతా ర‌హ‌స్యంగా ఉంటుంది. ప్ర‌భుత్వానికి త‌ప్ప ఎవ‌రికి తెలిసే అవ‌కాశం ఉండదు. అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా ఈ యాప్‌ పనిచేస్తుంది.

Here's CEO,Niti Aayog,GOI Amitabh Kant Tweet

యాప్ బెనిఫిట్స్ ఇవే:

కోవిడ్ -19 లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నిర్థారించ‌డానికి అనేక ప్రశ్నలను అడిగే ప్రత్యేకమైన చాట్‌బోట్ ఉంటుంది.

కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది

కరోనావైరస్ ఉన్న వ్య‌క్తికి దగ్గరగా వెళ్తే యాప్ మీ లొకేష‌న్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్ర‌భుత్వానికి చేర‌వేస్తుంది.

దేశంలో కరోనా కేసుల అప్‌డేట్‌ తెలుసుకోవచ్చు.

కేంద్ర‌, రాష్ట్ర‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే ప్ర‌క‌ట‌న‌లు, తీసుకునే చ‌ర్య‌లను తెలియజేస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని దాదాపు 6 మిలియన్ల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నట్టు నీతి ఆయోగ్‌లోని ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అర్నాబ్ కుమార్ తెలిపారు. యాప్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే మొత్తంగా 8 మిలియన్ ఇన్‌స్టాల్స్‌కు చేరువైందని పేర్కొన్నారు. అయితే, ఇన్‌స్టాళ్ల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సెక్షన్‌లో ఆరోగ్య సేత యాప్ టాప్‌ ప్లేస్‌లో నిలిచిందని పేర్కొన్న ఆయన.. ఉచిత యాప్‌ సెక్షన్‌లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిపారు.

వైరస్‌ పరీక్ష మీరే చేసుకోవచ్చు

వైరస్‌ సోకిందా అని స్వయంగా పరీక్ష చేసుకునేందుకు యాప్‌లో ‘సెల్ఫ్‌ అసెస్మెంట్‌ టెస్ట్‌పై’ క్లిక్‌ చేస్తే చాట్‌బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో వయసు, లింగం, ఆరోగ్య పరిస్థితి వివరాలను నమోదుచేస్తే ప్రమాదస్థాయిని యాప్‌ తెలుపుతుంది. మీ ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్‌ ఉంటే కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండటంతోపాటు ఇతరులకు వ్యాపించకుండా ప్రభుత్వానికి సహకరించినట్టవుతుంది.

ఆకుపచ్చ రంగు వస్తే క్షేమం

యాప్‌ ఇన్‌స్టాల్‌ ప్రక్రియ పూర్తిచేశాక పైభాగంలో ఆకుపచ్చ రంగు వస్తే క్షేమంగా ఉన్నట్టు. ఇది వైరస్‌ బారిన పడకుండా సామాజిక దూరం పాటించి, ఇంట్లోనే ఉండాలి వంటి జాగ్రత్తలను తెలుపుతుంది. ఒకవేళ మీరు ఇచ్చిన సమాధానాల ప్రకారం పైభాగంలో పసుపు రంగులో కనిపిస్తే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. కరోనా వైరస్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచిస్తుంది. వెంటనే అధికారులను సంప్రదించడం మంచిది. ఇందులో కొవిడ్‌-19 హెల్ప్‌లైన్‌ సెంటర్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

కాగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా భారత్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య సేతు యాప్‌పై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కురిపించింది. దీన్ని ఆవిష్కరించడం ద్వారా ప్రపంచ టెక్ దిగ్గజాలకు ఓ మార్గం చూపించిందని కితాబిచ్చింది. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు నిపుణులు, బహుళజాతి సంస్థలతో కలిసి అత్యంత ప్రయోజనకరంగా ఈ కరోనా ట్రాకింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్‌ ప్రారంభమైన కొద్దిరోజులకే ప్రపంచ టెక్ దిగ్గజాలైన ఆపిల్, గూగుల్ సంస్థలు సైతం ఈ తరహా నెట్‌వర్క్‌ను తమ స్మార్ట్‌ ఫోన్లలో పొందుపర్చనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.