AP Sand Booking Online Portal Registration all You need to know (Photo-sand.ap.gov.in)

Amaravathi, November 11: ఏపీలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక కొరత తీరినట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం( AP GOVT) పలు చోట్ల ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో ఇసుక నిల్వను ఉంచింది. విశాఖ శివారు అగనంపూడిలో 8,076 టన్నులు.. ముడసర్లోవలో 14,227 టన్నులు.. నక్కపల్లిలో650 టన్నులు.. నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా 23 వేల టన్నులకు పైగా ఇసుక ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో నిల్వ ఉంది.

నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు (AP Sand Online booking Process)  చేసుకున్నవారికి వెంటనే సరఫరా చేస్తున్నారు. ఈ యార్డుల్లో ఇప్పటివరకు 69,846 టన్నుల ఇసుక విక్రయాలు జరిగాయి.

మరోవైపు తూర్పు గోదావరి (East Godavari)జిల్లా గోదావరి, శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో వంశధార, నాగావళి నదుల్లో వరదలు తగ్గుముఖం పట్టాయి. విశాఖ జిల్లా అవసరాల కోసం ఆయా నదుల్లో కేటాయించిన రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా జోరందుకుంది. ఇక జిల్లాలో మరిన్ని స్టాక్‌ యార్డుల ఏర్పాటు ద్వారా ఇసుకను మరింత చేరువలో ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయి.

స్టాక్‌ యార్డులో ఇసుక కోసం టన్ను రూ.375 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రీచ్‌ నుంచి యార్డుకు కిలోమీటరును బట్టి రవాణా చార్జీ నిర్ణయించారు. టన్నుకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున వసూలు చేస్తున్నారు. లోడింగ్‌ చార్జీలు టన్నుకు రూ.50 అదనంగా పే చేయాలి.

ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని మడపాం నుంచి విశాఖలోని ముడసర్లోవ ఇసుక స్టాక్‌ యార్డు వరకూ 115 కిలో మీటర్లు దూరం ఉంది. కిలోమీటరుకు రూ.4.90 చొప్పున టన్నుకు ధర లెక్కిస్తున్నారు. ఈ మేరకు టన్నుకు రూ.975 చొప్పున ధర నిర్ణయించినట్లు గనుల శాఖ సహాయ సంచాలకులు టి.తమ్మినాయుడు చెప్పారు. అలాగే గోదావరి ఇసుక టన్ను ధర రూ.1375 ఉంది.

ఇసుకను కొనుగోలు చేయాలనుకున్నవారు ప్రభుత్వ ఆన్‌లైన్‌ సైట్ https://sand.ap.gov.in/index.htm లో తమ పేరును ఆధార్, మొబైల్‌ నంబరు ద్వారా నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆర్డరు రసీదు రూపంలో ఓఆర్‌ కోడ్‌ సహా మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. గనుల శాఖ పోర్టల్‌ https://www.minerap.com/ లో నమోదైన వాహనం ద్వారా ఇసుకను రవాణా చేసుకోవచ్చు. ఈ వాహనం నిర్దేశిత ప్రాంతం చేరేవరకూ ధ్రువీకరణ కోసం ఇ–రవాణా పత్రం అధికారులు స్టాక్‌యార్డు వద్ద ఇస్తారు.