పండగ సీజన్ రానున్న నేపథ్యంలో టెలివిజన్ తయారీ సంస్థలు కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వబోతున్నాయి. అక్టోబర్ నెలలో టీవీల ధరలు అమాంతం (TVs to cost more from next month) పెరిగే అవకాశాలున్నాయి. ఒక్కో టీవీ ధర 20 నుంచి 35 శాతం పెరుగవచ్చన్న అంచనాలు (TV Price Hike) పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్యానెళ్ల ధరలు పెరగడమేనని టీవీ ఇండస్ట్రీ చెబుతోంది. గడిచిన కొద్దివారాల్లో ప్యానెల్ ధరలు 20 శాతం పెరిగాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
కాగా టెలివిజన్ ధరలో దాదాపు 60 శాతం విలువ ఈ ప్యానెల్‌దేనని చెప్పాలి. టీవీ స్క్రీన్ తయారీలో ఈ ఓపెన్-సెల్ ప్యానెల్‌దే కీలకపాత్ర. నిజానికి ఇప్పటికే ఈ ఏడాది టీవీ ధరలు 10 శాతం వరకు పెరిగాయి. చైనా నుంచి విడిభాగాల సరఫరాలో తలెత్తిన ఇబ్బందులే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. ఇదిలా ఉంటే పెరుగనున్న టీవీ ధరలు కొనుగోళ్లను ప్రభావితం చేయవచ్చని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సాధారణంగా దసరా, దీపావళి, క్రిస్మస్‌లకు వచ్చే డిస్కౌంట్లతో కొత్త టీవీలను కొనుగోలు చేద్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈసారి అంతగా డిస్కౌంట్లు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు దుకాణదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అసలే కరోనాతో మార్కెట్ పడిపోయిందని, ఇప్పుడు టీవీల ధరలు పెరిగితే సేల్స్ ఇంకా తగ్గిపోవచ్చన్న భయాలు వారి నుంచి కనిపిస్తున్నాయి.
టీవీల తయారీలో వినియోగించే ఈ ఓపెన్-సెల్ ప్యానెల్స్ చైనా తదితర దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా కరోనాతో ఈ ఏడాది ఆరంభంలో చైనాలో ఉత్పత్తి నిలిచిపోవడం, ఆ తర్వాత ఇతర దేశాల్లో వచ్చిపడిన లాక్‌డౌన్ పరిస్థితులు తయారీ రంగాన్ని స్తంభింపజేశాయి. ఇది దేశీయ టీవీ తయారీ రంగాన్ని దెబ్బతీసిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఏప్రిల్ వరకు ప్యానెళ్ల దిగుమతులు
జరుగలేదని అంటున్నాయి.