
Hyderabad, Feb 25: ఔషధాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా-2025 (Bio Asia 2025) వార్షిక సదస్సు కాసేపటి క్రితం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, క్వీన్స్ లాండ్ గవర్నర్ జెన్నెట్ యంగ్, జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ తదితరులతోపాటు వివిధ బహుళజాతి కంపెనీల అధిపతులు, ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడే వివిధ అంశాలపై చర్చలతో పాటు ప్రసంగాలు కూడా ఉండనున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన లైవ్ వీడియో కింది లింక్ ద్వారా వీక్షించవచ్చు.
Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy participates in the Inauguration of Bio Asia 2025 at HICC,Hyderabad https://t.co/sB7fLFtTht
— Telangana CMO (@TelanganaCMO) February 25, 2025
యాభై దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు
రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు యాభై దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా లైఫ్ సైన్సెస్, ఆరోగ్యం, ఔషధ రంగాల అభివృద్ధిపై చర్చలు నిర్వహించనున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సారి సదస్సు ఏఐ ఆధారిత ఆరోగ్య పరిరక్షణ, క్లినికల్ పరిశోధనలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాదీల స్మార్ట్ నోట్ బుక్
బయో ఏషియా సదస్సులో హైదరాబాదీ టెకీలు అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత (AI Powered) పునర్వినియోగ స్మార్ట్ నోట్ బుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమెరికాలో నివసిస్తున్న కేసరి సాయికృష్ణ సబ్నివీసు, రఘురాం తటవర్తి.. హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితుడు సుమన్ బాలబొమ్ముతో కలిసి ఈ పునర్వినియోగ స్మార్ట్ నోట్ బుక్ ను (World's First AI Powered Reusable Smart Notebook) అభివృద్ధి చేశారు. హైదరాబాద్ కు చెందిన క్వాడ్రిక్ ఐటీ (Quadric IT) సంస్థ ద్వారా ఈ ఆవిష్కరణను తెరమీదకు తీసుకొచ్చారు. కృత్రిమ మేథస్సుతో (ఏఐ) పనిచేసే ఈ స్మార్ట్ రీ యూజబుల్ నోట్ బుక్ ఈ సంవత్సరపు బయో ఆసియా-2025 కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు ప్రముఖులు ఈ స్మార్ట్ నోట్ బుక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.