Koo APP

ఎక్స్' (ట్విట్ట‌ర్‌)కు ప్రత్యామ్నాయంగా వ‌చ్చిన స్వ‌దేశీ మైక్రోబ్లాగింగ్ 'కూ' మూత‌ప‌డింది. ఆర్థిక ఇబ్బందుల‌తో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ, కోఫౌండ‌ర్ మ‌యాంక్ బిదావ‌త్కా లింక్డ్‌ఇన్‌లో ఒక‌ పోస్ట్ ద్వారా ప్రకటించారు. డైలీహంట్ స‌హా వివిధ కంపెనీలతో విక్ర‌యానికి చ‌ర్చ‌లు జ‌రిపినా అవి విఫలం కావ‌డంతో తాజాగా త‌మ కార్యక‌లాపాల‌ను నిలిపి వేసింది. టైగర్ గ్లోబల్, యాక్సెల్, 3one4 క్యాపిటల్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్ వంటి ప్రముఖ పెట్టుబడిదారుల నుండి $50 మిలియన్లకు పైగా సేకరించినప్పటికీ కూ తన వినియోగదారుల సంఖ్యను పెంచుకోలేక‌పోయింది. దీంతో గతేడాది ఆదాయాన్ని సంపాదించడానికి చాలా కష్టపడింది.

ఏడేళ్లకే ముగిసిన రూ. 2 వేల నోటు ప్రస్థానం, ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య ఎంతో తెలుసా..

2020లో అప్రమేయ రాధాకృష్ణ, మ‌యాంక్ బిదావ‌త్కా దీన్ని స్థాపించ‌గా దాదాపు 60 మిలియ‌న్ డౌన్‌లోడ్‌లు జ‌రిగాయి. 10కి పైగా భాష‌ల్లో అందుబాటులో ఉన్న మొట్ట‌మొద‌టి ఇండియ‌న్ మైక్రోబ్లాగింగ్ సైట్‌గా ఇది గుర్తింపు పొందింది. ఈ యాప్ లోగో కూడా దాదాపు ట్విట్ట‌ర్‌ను పోలి (ప‌క్షి) ఉంటుంది.రైతు ఉద్య‌మ స‌మ‌యంలో కేంద్ర‌మంత్రులే స్వ‌యంగా దీన్ని ఆత్మ‌నిర్భ‌ర్ యాప్‌గా ప్ర‌మోట్ కూడా చేశారు. దీంతో త‌క్కువ స‌మ‌యంలోనే 'కూ'కు వినియోగ‌దారుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఆర్థిక క‌ష్టాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది. చివ‌ర‌కు మూసివేత‌కు దారితీసింది.