Beware of digital arrest, nothing like digital arrest in the law(X)!

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా ప్రకటనతో ప్రజలకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని NPCI స్పష్టం చేసింది. ఈ మోసాలు ప్రధానంగా భయపెట్టే పద్ధతుల ద్వారా డబ్బు దోచుకోవడంపైనే ఆధారపడి ఉంటాయని సంస్థ వివరించింది.

మోసగాళ్లు మొదట బాధితులను ఒక సాధారణ కాల్ ద్వారా సంప్రదిస్తారు. ఆ తర్వాత తమను పోలీసులు, సీబీఐ, ఆదాయ పన్ను శాఖ లేదా కస్టమ్స్ అధికారులు అని చెప్పి వీడియో కాల్‌కు మారతారు. బాధితులపై మనీ లాండరింగ్, పన్ను ఎగవేత, డ్రగ్స్ రవాణా వంటి తీవ్రమైన నేరాలు నమోదయ్యాయని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. మీపై వారెంట్ జారీ అయ్యింది. తక్షణం విచారణ అవసరం లేదా మీరు అరెస్టు కాబోతున్నారు వంటి మాటలతో బాధితులను మానసికంగా కుదిపివేస్తారు.

వీడియో కాల్ సమయంలో మోసగాళ్లు నకిలీ పోలీస్ యూనిఫాం ధరిస్తారు, బ్యాక్‌డ్రాప్‌లో ప్రభుత్వ కార్యాలయాలు లేదా పోలీస్ స్టేషన్‌ల వాతావరణం సృష్టిస్తారు. కొన్ని సందర్భాల్లో వెనుక నుంచి అధికారిక సంభాషణల శబ్దాలు వినిపించేలా నకిలీ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వాడతారు. ఈ విధంగా బాధితులను పూర్తిగా నమ్మించాక.. మీ పేరు కేసు నుంచి తొలగించడానికి, విచారణకు సహకరించడానికి, లేదా రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో డబ్బులు పంపాలని ఒత్తిడి తెస్తారు.

అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపులు, సీనియర్ స్థాయి అధికారులతో కలిపి దాదాపు 14 వేల మంది బయటకు, ఏఐ రాకతో ఉద్యోగులకు దినదిన గండం

ఈ విధంగా వందలాది మంది నుంచి లక్షల రూపాయల వరకు దోచుకుంటున్నారని NPCI తెలిపింది. ప్రత్యేకంగా వృద్ధులు, గృహిణులు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా తెలిసినవారు ఈ మోసాలకు ఎక్కువగా గురవుతున్నారని హెచ్చరించింది

NPCI ప్రకారం, ఏ ప్రభుత్వ సంస్థ.. పోలీసు, సీబీఐ, ఆదాయ పన్ను లేదా కస్టమ్స్ శాఖ అయినా ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా విచారణ జరపదు. డబ్బు బదిలీ చేయమని కూడా ఎప్పుడూ కోరదు. కాబట్టి ఇలాంటి కాల్స్ వస్తే ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందకుండా వెంటనే కాల్ కట్ చేయాలని సూచించింది. అనుమానాస్పద కాల్‌లు లేదా వీడియో చాట్స్‌కు సంబంధించిన అన్ని వివరాలను రికార్డ్ చేయడం, స్క్రీన్‌షాట్‌లు సేవ్ చేయడం అవసరం. ఈ వివరాలు అధికారులకు సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి.

ఇలాంటి ఘటనలు ఎదురైతే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు లేదా సంచార్ సాథి పోర్టల్ లో ఆన్‌లైన్‌గా నివేదించవచ్చు. NPCI ప్రజలను భయపడకండి, ఆలోచించండి, ధృవీకరించండి అనే మూడు సూత్రాలను పాటించమని సూచించింది. సైబర్ నేరాల నివారణకు NPCI, RBI, సైబర్ సెక్యూరిటీ విభాగాలు కలసి పనిచేస్తున్నాయి. పేమెంట్ యాప్స్, UPI ట్రాన్సాక్షన్లకు సంబంధించిన భద్రతా ప్రమాణాలను మరింత బలపరచే చర్యలు కూడా చేపట్టారు. ప్రజలు తమ బ్యాంకింగ్ లేదా డిజిటల్ ట్రాన్సాక్షన్ వివరాలను ఎప్పుడూ ఎవరికీ పంచుకోవద్దని NPCI మరోసారి స్పష్టం చేసింది.