PAN-Aadhaar Link: పాన్ ఆధార్ లింక్ చేశారా, ఈ నెల చివరి వరకే డెడ్‌లైన్, తరువాత పాన్ కార్డు చెల్లదు, చేయకుంటే వెంటనే ఈ ప్రాసెస్ ద్వారా లింక్ చేయండి
PAN-Aadhaar linking deadline this month (Photo-PTI

September 28:  ఇప్పుడు ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు అనేది తప్పనిసరిగా మారింది. ఆర్థికపరమైన లావాదేవీలకు పాన్ కార్డు ( PAN card) అనేది చాలా అవసరం. పన్ను ఎగవేతదారులకు అడ్డుకట్ట వేయడంలో పాన్ నెంబర్‌ది కీలక పాత్ర. అందుకే పెద్ద లావాదేవీలకు పాన్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాలని ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ ప్రకారం పాన్‌కార్డు, ఆధార్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండింటిని అనుసంధానం చేసుకోవాలి. అలాగే ఇన్‌కం ట్యాక్స్‌( Income Tax) రిటర్న్‌ల ఫైలింగ్‌కు ఆధార్‌ నంబర్‌ కూడా అవసరం. ఈ ప్రాసెస్ కు ఆదాయపు పన్ను శాఖ ఈ నెల 30 వరకు డెడ్ లైన్ విధించింది. పాన్‌కార్డు లేనివారు ఆధార్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఆధార్‌ సంఖ్యను పాన్‌కార్డుతో అనుసంధానం ఆన్‌లైన్‌లోనూ, ఎస్‌ఎంఎస్‌ ద్వారా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఎలాగో చూద్దాం.  మీ పాన్ కార్డ్ పనిచేయాలంటే వెంటనే మీ ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలి. సులభంగా ఎలా చేయాలో తెలుసుకోండి.

లింక్ ఇలా చేయండి

ముందుగా ఆదాయపన్ను శాఖ ఇ–ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ www.incometaxindiaefiling.gov.in లో లాగిన్‌ అయి ప్రొఫైల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ ఎడమ భాగంలో లింక్‌ ఆధార్‌ న్యూ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్‌ అవుతుంది. అక్కడ పాన్‌కార్డు సంఖ్య, ఆధార్‌కార్డు సంఖ్య, పేరు వివరాలను పూర్తి చేయాలి. మీరు ఎంటర్ చేసిన తరువాత ఆదాయపన్ను శాఖ ఈ వివరాలను సరిచూస్తుంది. క్రాస్‌ చెక్‌ పూర్తి అయిన తర్వాత మీ నంబర్, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి. ఇది పూర్తయిన తరువాతే మీకు మెసేజ్ వస్తుంది. అయితే వివరాలు కరెక్ట్ గా లేకుంటే మీ పని జరగదు.

ఎస్‌ఎంఎస్‌ ద్వారా చేయడం ఎలా ?

మీ మొబైల్ నుంచి యూఐడీపీఏఎస్‌(UIDPAS) అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఆధార్‌ నంబర్‌ ( Aadhaar Number) ఎంటర్‌ చేసి స్పేస్‌ ఇచ్చి పాన్‌ నంబర్‌( Pan Number) ఎంటర్‌ చేసి 567678కు ఎస్‌ఎంఎస్‌ పంపాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ లో మీరు ఆధార్‌కార్డు ( Aadhaar card)తో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌తోనే ఎస్‌ఎంఎస్‌ పంపాల్సి ఉంటుంది.