
భారతదేశం ఇప్పటి వరకు 9 ముఖ్యమైన ప్రపంచ రికార్డులను సాధించిందని, త్వరలో 8–10 కొత్త రికార్డులను సాధించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు.మంగళవారం జరిగిన 52వ జాతీయ మేనేజ్‌మెంట్ కన్వెన్షన్‌లో.. భారత్ అంతరిక్ష కార్యక్రమ విజయాలను, భవిష్యత్తు లక్ష్యాలను ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వివరించారు. 2008లో ప్రారంభమైన చంద్రయాన్ మిషన్‌ల ద్వారా భారతదేశం అంతరిక్ష రంగంలో విప్లవాత్మక ఘనతలు సాధించిందన్నారు.
చంద్రయాన్-1 ద్వారా భారతదేశం చంద్రుని ఉపరితలం, ఉప ఉపరితలం, ఎక్సోస్పియర్‌లో నీటి అణువులను కనుగొన్న తొలి దేశంగా నిలిచిందని తెలిపారు. దీనిని నాసా యొక్క సోఫియా అబ్జర్వేటరీ ధృవీకరించింది. 2014లో భారతదేశం మార్స్ ఆర్బిటర్ మిషన్ (Mangalyaan) ద్వారా మొదటి ప్రయత్నంలోనే రెడ్ ప్లానెట్‌ను చేరిన ప్రపంచంలోని మొదటి దేశంగా నిలిచిందన్నారు.
ఇస్రో కొత్త చీఫ్‌గా వి నారాయణన్, చంద్రయాన్-4, గగన్‌యాన్ మిషన్లపై కీలక అప్‌డేట్ ఇచ్చిన వి నారాయణన్
2017లో PSLV-C37 మిషన్ ద్వారా ఒక్కసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింన దేశంగా భారత్ నిలిచిందన్నారు. 2019లో చంద్రయాన్-2 మిషన్ తో అత్యుత్తమ హై-రిజల్యూషన్ ఆర్బిటర్ కెమెరా అందుకొని.. చంద్రుని కక్ష్యలో గొప్ప పరిశోధనలు చేయడానికి దోహదపడిందన్నారు. ఆగస్టు 2023లో చంద్రయాన్-3 ద్వారా భారత్.. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన తొలి దేశంగా చరిత్ర సృష్టించిందని ఇస్రో చైర్మన్ వివరించారు. ఇదే కాకుండా, ఇస్రో తొలి సారిగా ఇన్ సిటు కొలతలను కూడా తీసుకున్నదన్నారు.
India Sets 9 World Records in Space, Plans 8–10 More: ISRO Chairman
View this post on Instagram
ఇస్రో అభివృద్ధి చేసిన LVM3 క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ ద్వారా భారతదేశం మూడు ప్రపంచ రికార్డులను సాధించింది. సాధారణంగా నాలుగు నుండి పదకొండు ఇంజిన్లతో పనిచేసే క్రయోజెనిక్ స్టేజ్‌ను కేవలం మూడు ఇంజిన్లతో అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఈ టెక్నాలజీ అభివృద్ధి పూర్తయ్యేందుకు ప్రపంచ దేశాల కంటే తక్కువ కాల వ్యవధి పట్టిందని వి. నారాయణన్ తెలిపారు.
భవిష్యత్తులో 8–10 కొత్త ప్రపంచ రికార్డులను సాధించడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇస్రో దేశీయ సాంకేతిక బదిలీని పెంచుతూ, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, భద్రతను అభివృద్ధి చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఇస్రో చీఫ్ చెప్పినట్లుగా.. ఖర్చు విషయంలో ఎంతో జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించి, ప్రతి ప్రయోగాన్ని గణనీయమైన పద్ధతిలో నిర్వహించడం ద్వారా ఖర్చును తగ్గిస్తూ ప్రయోగాలను చేపడుతున్నారు. ఇప్పటి వరకు భారతదేశం నుండి 4,000కి పైగా రాకెట్లు ప్రయోగించి, 133 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది.
2040 నాటికి చంద్రునిపై మనిషిని పంపి భారత జెండాను ఎగురవేయడం లక్ష్యమని నారాయణన్ ప్రకటించారు. ఎడ్ల బండ్లు, సైకిళ్లు నుంచి నేటి ఆధునిక అంతరిక్ష ప్రయాణం వరకు భారత ప్రయాణం అద్భుతమైనది. ఇది భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టే దారిలో ఉందని కొనియాడారు.