CARTOSAT-3: పిఎస్ఎల్వి-సి 47 ప్రయోగం విజయవంతం, ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టోసాట్ -3 ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో, 13 అమెరికా ఉపగ్రహాలనూ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్
CARTOSAT-3 Earth Imaging Satellite Launched by ISRO. |(Photo Credits: ISRO)

Sriharikota, November 27:  శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన PSLV C47 ప్రయోగం విజయవంతమైంది. బుధవారం ఉదయం 9:28 గంటలకు ఈ ప్రయోగం చేపట్టారు. భారత్ కోసం ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం కార్టోసాట్ -3తో పాటు,  13 అమెరికా నానో ఉపగ్రహాలను విజయవంతంగా పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సీ47 (PSLV C47) రాకెట్ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

ఈ ప్రయోగంతో ఇస్రో 300 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు భారత్ తన పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ ద్వారా 297 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈరోజు 13 అమెరికన్ నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారత్ ప్రయోగించిన మొత్తం విదేశీ ఉపగ్రహాల సంఖ్య 310కి చేరింది.

Watch the Launch Video of  PSLV C47 :

1,625 కిలోల కార్టోసాట్ -3 శాటిలైట్ ప్రయోగం ద్వారా , భారతదేశం భూఉపరితలానికి సంబంధించి హైరెసల్యూషన్ చిత్రాలు తీయవచ్చు. దీంతో పట్టణ ప్రణాళిక, గ్రామీణ వనరులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి, తీరప్రాంత భూ వినియోగం మరియు ఉగ్ర శిబిరాల జాడ కనిపెడుతూ వ్యూహాత్మక,రక్షణ చర్యలు చేపట్టే ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది.  డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇస్రోలో ఉద్యోగాలు

ఈ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో చైర్మన్ కే.శివన్ మాట్లాడారు. ఇంతటి అద్భుత ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా మార్చి వరకు వరుసగా మొత్తం 13 మిషన్లు ఉన్నాయని చెప్పారు. తమకు ఇప్పుడు చేతినిండా పని ఉందని, సందర్భానికి తగినట్లుగా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఇస్రో సిబ్బంది అంతా సిద్ధంగా ఉందని శివన్ తెలిపారు.