ఇకపై ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లించడం సాధ్యపడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలను నిలిపివేస్తున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా ఎలాంటి విద్యుత్తు బిల్లులు చెల్లించకూడదని టీజీఎస్‌పీడీసీఎల్ తెలిపింది.
భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని చెప్పింది.భవిష్యత్తులో టీజీఎస్‌పీడీసీఎల్ లేదా ఎస్‌పీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే విద్యుత్తు బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించింది. కరెంట్ బిల్లుల చెల్లింపులపై కీలక అప్‌డేట్, ఇకపై మీరు పేమెంట్లు అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో మాత్రమే చెల్లించాలి, జులై 1 నుంచి అన్నిగేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపుల నిలిపివేత
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఎస్‌పీడీసీఎల్ పరిధిలో 85 శాతానికి పైగా పవర్ బిల్లు చెల్లింపులు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (టీపీఏపీ) ద్వారానే జరుగుతున్నాయి. ఇందుకోసం కొన్ని యూపీఐ ఆధారిత యాప్‌లను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం..బ్యాంకు యాప్‌లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)లో నమోదవ్వాలి. కానీ చాలా థర్డ్ పార్టీ యాప్‌లకు సేవలందిస్తున్న బ్యాంకులు ఇంకా ఈ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసుకోలేదు. దాంతో సదరు చెల్లింపులను నిలిపేస్తున్నామని తెలిపారు.
Here's Tweet
Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…
— TGSPDCL (@tgspdcl) July 1, 2024
జులై 1 నుంచి ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే చెల్లింపులు చేయాలని పేర్కొంది. ఇందులో భాగంగా యూపీఐ సేవలందించే బ్యాంకులు బీబీపీఎస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పటివరకు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోలేదు. దానివల్ల ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే.. వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల్లో బిల్లులు చెల్లించలేరు. ఆ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డుల నుంచి కూడా బిల్లు పేమెంట్ చేయలేరు.
ఇక ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ ప్లాట్‌ఫామ్‌లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు.