టిక్‌టాక్ మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. 700 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్‌ల తాలూకు ఇ-మెయిల్స్ అందినట్లు సమాచారం. కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ఉద్వాసనను టిక్‌టాక్ ధృవీకరించింది.
అయితే ఎంతమందిని తొలగించిందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. తన వ్యూహాత్యక చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక 2024 మేలో కూడా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ఉద్యోగులను టిక్‌టాక్ తొలగించిన విషయం తెలిసిందే. మార్కెటింగ్, కంటెంట్ విభాగాల్లోనే ఈ తొలగింపులు చోటుచేసుకున్నాయి.