ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపేందుకు వీలుగా ఈ ఒప్పందాలు చేసుకుంటోంది. దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సౌకర్యం 2016లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆరంభంలో అడుగులు నెమ్మదిగా పడినా ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ (UPI Payment System) సర్వసాధారణ విషయంగా మారింది.
ప్రతి చిన్న లావాదేవీకి యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు దేశంలో మాత్రమే యూపీఐ పేమెంట్స్ జరిగేవి. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపడం ఇబ్బందిగా ఉండేది. ఈ నేపథ్యంలో వారి కష్టాలు తొలగించే దిశగా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా తొలుత జీ 20 దేశాలతో ఈ మేరకు అవగాహనకు రావాలని నిర్ణయించింది.తొలిసారిగా భారత్ , సింగపూర్ దేశాల మధ్య ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానేటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్‌ల మధ్య ఒప్పందం (India and Singapore sign pact) కుదిరింది.
ఈ మేరకు ఇండియాలోని యూపీఐ యూజర్లు సింగపూర్‌లో ఉన్న పే నౌ యౌజర్లతో తేలికగా ఆర్థిక లావాదేవీలు ( instant flow of retail payments ) నిర్వహించేందుకు వీలు కలగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. 2022 జులై నుంచి ఇండియా, సింగపూర్ దేశాల మధ్య యూపీఐ చెల్లింపుల నిర్ణయం అమల్లోకి రానుంది.