Bengaluru, April 1: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిపై ( Coronavirus) పోరు కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్-19 (COVID-19) మహమ్మారి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి, మనవతా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తాజాగా విప్రో లిమిటెడ్ (Wipro), విప్రో ఎంటర్‌ప్రైజెస్, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ (Azim Premji Foundation) కలిసి రూ.1,125 కోట్ల సాయాన్ని అందించడానికి ముందుకొచ్చాయి.
కరోనా అంతు చూస్తామంటున్న కార్పోరేట్
మొత్తం విరాళంలో విప్రో రూ.100కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్ రూ.25కోట్లు, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ తరఫున 1000 కోట్లను తమవంతు సాయంగా కేటాయించినట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేటాయించిన ఈ భారీ మొత్తం తాము చేపట్టే సామాజిక కార్యక్రమాల కోసం (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఖర్చుపెట్టే నిధులకు అదనం అని వెల్లడించింది. అంటువ్యాధి ప్రబలకుండా తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి అండగా ఉంటామని ఈ సందర్భంగా పేర్కొంది.
కాగా విప్రో కంపెనీల వ్యవస్థాపకుడు, ఐటీ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ (Azim Premji) 2019 మార్చిలో సామాజిక సేవ నిమిత్తం తన సంపదలో 52,750 కోట్ల రూపాయలు(ఆయన షేర్లలో 34 శాతానికి సమానం) వెచ్చించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధులను అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
కరోనావైరస్‌పై పోరాటానికి బాధ్యతగా విరాళాలు అందజేస్తున్న ప్రముఖులు
విప్రో వార్షిక..కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధి నుంచి కాకుండా అదనంగా ఈ సాయాన్ని ప్రకటించామని, అలాగే ఫౌండేషన్ సాధారణ దాతృత్వ ఖర్చులతో సంబంధం లేకుండా ఫౌండేషన్ నుంచి కూడా అదనంగా విరాళం ఇస్తున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ తన సంపాదనలో చాలా వరకు దాతృత్వ కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తున్నారు.
కాగా ప్రాణాంతక కరోనా మహమ్మారిపై యుద్ధానికి టాటా గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది. కరోనా వైరస్ పీడితులకు అవసరమైన వెంటిలేటర్లను సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వాటిని తయారు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. దేశంలో.. ప్రపంచంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేగవంతమైన నివారణ చర్యలు అవసరమన్నారు. కరోనా నివారణకు టాటా ట్రస్టుతో కలిసి పని చేస్తామన్నారు.