Brasília, Dec 20: అమెరికా ఆమోదం తెలిపి కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఫైజర్ టీకా (Pfizer/BioNTech vaccine) తయారీ కంపెనీలపై బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సనారో (Brazilian President Bolsonaro) తన దాడిని ఎక్కుపెట్టారు. ఈ కోవిడ్ వ్యాక్సిన్ (Covid vaccine) తీసుకుంటే మీరు మొసళ్లలా మారిపోవచ్చు.. ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలూ ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముందు నుంచి కరోనా వైరస్ అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన.. తాజాగా మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి దుష్ప్రభావాలకు తాము బాధ్యత వహించమనీ, మీరు (ప్రజలు) మొసళ్లుగా మారితే, అది మీ సమస్య అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సూపర్ హూమన్‌గా మారినా, మహిళలకు గడ్డం మొలిచినా, పురుషులు ఆడవారిగా మాట్లాడినా ఔషధ తయారీదారులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ వారిపై దాడిచేశారు. టీకా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది కానీ తాను మాత్రం కరోనా టీకా వేసుకొనేది లేదని మరోసారి స్పష్టం చేశారు.
Here's AFP Tweet
"In the Pfizer contract it's very clear: 'we're not responsible for any side effects.' If you turn into a crocodile, it's your problem," #Brazilian President Jair Bolsonaro said in explaining why he does not want to get a #CovidVaccine https://t.co/xcAJWpl4K1 pic.twitter.com/G4yPIw6297
— AFP News Agency (@AFP) December 18, 2020
ఇప్పటికే తనకు కరోనా సోకిన కారణంగా తన శరీరంలో యాంటిబాడీస్ ఉన్నాయి.. ఇక తానెందుకు టీకా తీసుకోవాలంటూ ప్రశ్నించారు. అలాగే టీకాను తాము ఉచితంగా ఇవ్వబోతున్నామని, అలాగని టీకా తప్పనిసరి కాదన్నారు. టీకా తీసుకోని వారికి జరిమానాలు విధించబోమని, ఒత్తిడి చేసే ప్రసక్తే ఉండదని బోల్సనారో స్పష్టం చేశారు.
కాగా బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 7.1 మిలియన్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షా 85 వేల మంది మృతి చెందారు. గతంలో కరోనా వైరస్, లాక్‌డౌన్‌పై విభిన్నంగా స్పందించిన బ్రిజిల్ అధ్యక్షుడు కరోనా సాధారణ ఫ్లూమాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. మాస్క్ ధరించేందుకు నిరాకరించి వివాదంలో నిలిచారు. ఆ తరువాత ఆయన కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.