Coronavirus War: అమెరికా, చైనాల మధ్య కరోనా వార్, ట్రంప్ ‘చైనీస్ వైరస్’ ట్వీటుపై డ్రాగన్ కంట్రీలో నిరసనలు, అమెరికా సైన్యమే వైరస్ వ్యాప్తికి కారణమంటున్న చైనా
US President Donald Trump (Photo Credits: Getty Images/File)

Washington DC, Mar 18: ప్రపంచాన్ని కరోనావైరస్ (Coronovirus) వణికిస్తోంది. అన్ని దేశాలు కోవిడ్ 19 (COVID-19) దెబ్బకి హడలిపోతున్నాయి. చైనాలోని వుహాన్ లో (Wuhan In China) పుట్టిన ఈ వైరస్ దాదాపు అన్ని దేశాలకు విస్తరించి ముప్పతిప్పలు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ మీద రెండు అగ్ర దేశాల మధ్య వార్ (Coronavirus War) మొదలైంది. కరోనా వైరస్‌పై అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఇండియాలో కరోనా కల్లోలం, 147 కేసులు నమోదు, ముగ్గురు మృతి

చైనీస్‌ వైరస్‌ ప్రపంచంలో వేగంగా విస్తరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఈ మధ్య ట్వీట్‌ చేశారు. అయితే దీనిపై చైనా నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ట్రంప్‌ తన వ్యాఖ్యలను మరింతగా సమర్ధించుకున్నారు.

ఇది చైనా నుంచి రావడంతో ఆ పదమే సరైనదని తాను భావించానని అందుకే ట్వీట్ చేశానని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అలాగే కొవిడ్‌-19 వ్యాప్తికి అమెరికా సైన్యమే కారణమని చైనా దుష్ర్పచారం సాగిస్తోందని ట్రంప్‌ డ్రాగన్ కంట్రీపై మండిపడ్డారు.తమ సేనలే చైనీయులకు ఈ వైరస్‌ను వ్యాప్తి చేశారని చైనా చెప్పడం సరైంది కాదని, తమ సైన్యం దీన్ని ఎవరికీ ఇవ్వలేదని ఆయన చెప్పారు.

అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనాతో విలవిలలాడుతోంది. అక్కడ మూడు వేల మందికి పైగా జనం ఈ వైరస్‌ బారినపడగా ఇందులో 62 మంది మరణించారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 1,83,579 పాజిటివ్‌ కేసులు నమోదవగా 7,400 మందికి పైగా మరణించారు. ఈ సంఖ్య రోజు రొజుకు పెరుగుతూ వెళుతోంది.