Washington, Dec 20: కరోనా వైరస్ అమెరికాలో కల్లోలం రేపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లకు (COVID-19 Vaccine Update) అందుబాటులోకి తీసుకొచ్చే కసరత్తు కూడా భారీగానే జరుగుతోంది. ఇందులో భాగంగా ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ల (Pfizer COVID-19 Vaccine) వినియోగానికి అనుమతి లభించింది. దీంతో ప్రజల్లో వ్యాక్సిన్‌పై విశ్వాసాన్ని నింపేందుకు అమెరికా తదుపరి అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ( Joe Biden) , అతని భార్య జిల్ వ్యాక్సిన్‌ను స్వీకరించేందుకు ముందుకు వచ్చారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి మోతాదును బహిరంగంగా డిసెంబర్ 21వ తేదీన పొందనున్నారని బైడెన్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ప్రకటించారు. ఇప్పటికే చాలాసార్లు బైడెన్ చెప్పినట్లుగా, వ్యాక్సిన్ సురక్షితమైందని ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని పంపడకోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. శుక్రవారం పెన్స్ స్వీకరించినట్టుగా బహిరంగంగా టీకా తీసుకుంటారని, అలాగే డెలావేర్ కేంద్రంలో టీకాను తీసుకోనున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలపనున్నారని ఆమె వెల్లడించారు.
అలాగే ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్, ఆమె భర్త కూడా వచ్చే వారం టీకాను స్వీకరిస్తారు. కరోనా టీకా తొలి మోతాదును స్వీకరించనున్నామని ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కారెన్,హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ప్రకటించిన అనంతరం బైడెన్ నిర్ణయం రావడం విశేషం. మరోవైపు బైడెన్ సీనియర్ సలహాదారుడు, కాంగ్రెస్ సభ్యుడు సెడ్రిక్ రిచ్‌మండ్‌కు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఇప్పటివరకు కరోనా వల్ల 3,14, 000 మందికి పైగా మరణించారు.
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు. గత శుక్రవారం ఆయన ఫైజర్ టీకాను తీసుకున్నారు. అదేవిధంగా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సోమవారం తొలివిడత టీకా తీసుకోనున్నారు. ఇక, ప్రస్తుతానికి తాను టీకా తీసుకోవడంలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశ ఆరోగ్యశాఖ మంత్రి యూలి ఎడెల్‌స్టీన్‌తో కలిసి 71 ఏండ్ల నెతన్యాహూ శనివారం ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇరువురు నేతలు మరో మూడు వారాల్లో బూస్టర్ డోస్ తీసుకోనున్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడాకి, వ్యక్తిగత ఉదాహరణలుగా నిలవడానికి ఆరోగ్యశాఖ మంత్రితో కలిసి తాను మొదటి వ్యాక్సిన్‌ను తీసుకోవాలనుకున్నానని నెతన్యాహూ అన్నారు. నెతన్యాహూ టీకా తీసుకునే కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా ప్రసారమయ్యింది.
ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. దీనికోసం పది దవాఖానలు, వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఫైజర్ టీకాలను ఇప్పటికే పంపిణీ చేశారు. దేశంలో ఇప్పటివరకు 3,70,000 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 3 వేల మంది మరణించారు. దేశంలో మొదటి కరోనా కేసు ఫిబ్రవరిలో నమోదయ్యింది.