Washington D.C, January 7: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన జో బైడెన్ గెలుపుకు సంబంధించిన అధికారిక ప్రకటనను నిలువరించేందుకు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషం వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బైడెన్ గెలుపుని యూఎస్ కాంగ్రెస్ అధికారికంగా ధ్రువీకరించింది. దీంతో ఈనెల 20న ఆయన యూఎస్ 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో బైడెన్ నేతృత్వంలోని డెమొక్రాట్లకు మద్దతుగా 306 ఓట్లు, ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్లకు మద్దతుగా 232 ఓట్లు వచ్చాయని ఎలక్టోరల్ కాలేజీ ప్రకటించింది. యూఎస్ ప్రెసిడెంట్‌గా జో బిడెన్ మరియు వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్ విజయం సాధించినట్లు అమెరికా కాంగ్రెస్ ధృవీకరించింది.యూఎస్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రిసైడింగ్ అధికారి హోదా గల మైక్ పెన్స్ ఈ ఫలితాన్ని ధ్రువీకరించారు.
ఈ సమావేశానికి ముందు ట్రంప్ మద్ధతుదారులు క్యాపిటల్ భవనం వద్ద అల్లర్లు సృష్టించారు. ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి నిరాకరించిన ట్రంప్, యూఎస్ కాంగ్రెస్ సమావేశాన్ని చివరి నిమిషం వరకూ అడ్డుకోవడానికి ప్రయత్నించిన ట్రంప్, తన మద్దతుదారులను రెచ్చగొట్టి సమావేశం జరిగే క్యాపిటల్ హిల్‌పై దాడికి ఉసిగొల్పారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. భద్రత సిబ్బంది పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చిన తర్వాత భారీ భద్రత నడుమ యూఎస్ కాంగ్రెస్ సమావేశం కొనసాగింది. హింసాత్మక ఘటనలను యూఎస్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
ఇదిలా ఉంటే, తన ఎత్తులేమి పారకపోవడంతో ఇక డొనాల్డ్ ట్రంప్ దిగిరాక తప్పలేదు, ఎట్టకేలకు ఆయన దిగివస్తూ జో బైడెన్ కు అమెరికా అధ్యక్షుడిగా అధికార బదిలీకి చట్టబద్ధంగా సహకరిస్తానని ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ, ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే తన వాదనకు ఇప్పటికీ కట్టుబడి ఉంటానని ఆయన నొక్కి చెప్పారు.