New York, April 5: పోర్న్‌స్టార్‌కు చెల్లింపుల కేసులో అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయిన సంగతి విదితమే. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టుకు హాజరైన ట్రంప్ ముందుగా డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో లొంగిపోయారు. కోర్టు సిబ్బంది ఆయన వేలిముద్రలు, ఫొటోలు తీసుకున్నారు. దీంతో ట్రంప్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నట్టు కోర్టు పరిగణించింది.
కాగా బిజినెస్ రికార్డు(Business Records)లను మోసం చేసిన కేసులో ట్రంప్‌పై 34 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. ఒకవేళ ఆ కేసుల్లో ట్రంప్ దోషిగా తేలితే, దాదాపు 136 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఒకవేళ ట్రంప్ దోషిగా తేలినా.. అంత శిక్ష వేయకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో.. స్టార్మీ డానియల్స్ అనే పోర్న్‌స్టార్‌తో తనకున్న శారీరక సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బు ఇచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నారని ట్రంప్ నేరాభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పోర్న్ స్టార్(porn star) స్టార్మీ డేనియల్స్‌కు లక్షా 30 వేల డాలర్లు చెల్లించిన అంశంలో.. ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ తన బిజినెస్ రికార్డులను మార్చినట్లు ట్రంప్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీనిలో భాగంగానే ఎన్నికల చట్టాలను కూడా మార్చే ఆలోచన చేసినట్లు న్యాయవాది ఆరోపించారు. ఆ హష్ మనీ వివరాల్ని దాచిపెట్టేందుకు ట్రంప్ 34 తప్పుడు ఎంట్రీలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ట్రంప్‌తో తనకు శారీరక బంధం ఉందని, 2006లో ఓ హోటల్‌లో తామిద్దరం ఏకాంతంగా కలిశామని పోర్న్‌స్టార్ స్టార్మీ ఆరోపిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని బయటపెట్టకుండా తనతో ట్రంప్ ఒప్పందం చేసుకొని డబ్బును చెల్లించారన్నారు. ఇదిలా ఉంటే 235 ఏండ్ల అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం.
ట్రంప్ దీనిపై ఏమన్నారు..
కోర్టు నుంచి వెళ్లిన తర్వాత ఫ్లోరిడాలోని తన నివాసం (Florida) వద్ద మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ (Trump) మాట్లాడుతూ.. మన దేశం నాశనం అవుతున్నదని, నరకానికి వెళ్తుందని బైడెన్ (Joe Biden) ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అఫ్గానిస్థాన్ (Afghanistan) నుంచి మన బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ప్రపంచం మనల్ని చూసి నవ్వుతున్నదని విమర్శించారు. మనం మన దేశాన్ని రక్షించుకోవాలి. అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని తానెప్పుడూ అనుకోలేదన్నారు. ఇది దేశానికి అవమానం అని చెప్పారు. దేశాన్ని నాశనం చేయాలనుకునేవారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించడమే తాను చేసిన నేరమని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు తనపై ఈ తప్పుడు కేసు పెట్టారని, వెంటనే దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.