Donald Trump Hopes to Reopen Economy by Easter as US Registers 10,000 New COVID-19 Cases (Photo-ANI)

Washington, March 25: అగ్రరాజ్యాన్ని కరోనావైరస్ (Coronavirus) ముప్పతిప్పలు పెడుతోంది. ఆ దేశంలో 24 గంటల వ్యవధిలోనే పదివేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఆ దేశంలో కోవిడ్‌ (Covid-19) బాధితుల సంఖ్య 49,594కు చేరుకుంది. ఒకే రోజులోనే 130 మంది మరణించారు. దీంతో అమెరికాలో (America) మృతుల సంఖ్య 622కి పెరిగింది. కోవిడ్‌ కల్లోలానికి ప్రపంచ వ్యాప్తంగా 16,961 మంది ప్రాణాలు కోల్పోగా, 4 లక్షల మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద సుమారు 175 దేశాలు, ప్రాంతాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి.

కరోనావైరస్‌ను ఇండియా తరిమేస్తుంది

కాగా మాస్కులు, శానిటైజర్లు ఇతర మందులను నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా నిల్వ చేసినా శిక్ష తప్పదన్నారు. కాగా అమెరికాలో కోవిడ్‌ బారిన పడ్డ (COVID-19 in US) ప్రతి ఇద్దరిలో ఒక్కరు న్యూయార్క్‌కు (New York) చెందిన వారే. సోమవారం సుమారు 5085 కొత్త కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకూ ఉన్న కేసుల సంఖ్య 20,875కు ఎగబాకింది. కాగా న్యూయార్క్‌లో ఇప్పటికే 43 మంది మరణించారు.

కరోనాపై ఇండియా ఘనవిజయం, 48 మంది పేషెంట్లు రికవరీ

న్యూయార్క్‌ నగరం, మెట్రో ఏరియా, న్యూజెర్సీ, లాండ్‌ ఐలాండ్‌ ప్రాంతాల్లో ప్రతి వెయ్యిమందిలో ఒకరు వ్యాధి బారిన పడ్డారని వైట్‌హౌస్‌లో కరోనా టాస్క్‌ఫోర్స్‌ అధికారి డెబ్రా ఎల్‌ బ్రిక్స్‌ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు కూడా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్‌ స్టేట్, కాలిఫోర్నియాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, తగినని మందులు, ఇతర పరికరాలను అక్కడకు పంపిస్తున్నామని తెలిపారు.

21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్

ఫెడరల్‌ ఎమర్జెన్సీ ఏజెన్సీ సుమారు 80 లక్షల ఎన్‌–95 మాస్కులను పంపిణీ చేస్తోందని, కోటీ 33 లక్షల సర్జికల్‌ మాస్కులూ అందిస్తున్నామని తెలిపారు. కోవిడ్‌–19పై ప్రభావం చూపే మందుల కోసం పరిశోధనలు ముమ్మరం చేశామని, క్లోరోక్వైన్‌ వంటి యాంటీ మలేరియా మందుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం

మధ్యప్రాచ్య దేశం ఇరాన్‌లో మంగళవారం మరో 122 మంది మరణించడంతో కోవిడ్‌ –19 కారణంగా ఆ దేశంలో ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1934కు చేరుకుంది. తాజాగా 24 గంటల్లో 1762 కొత్త కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకూ మొత్తం 24,811 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని అధికార ప్రతినిధి కియానౌష్‌ జహాన్‌పౌర్‌ ఒక టెలివిజన్‌ ప్రకటన ద్వారా తెలిపారు.

స్పెయిన్‌లో కోవిడ్‌ –19 విలయం కొనసాగుతోంది. ఒక్క రోజులో ఏకంగా 514 మరణాలు సంభవించగా ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2696కు చేరిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దేశంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 40 వేలుగా ఉంది.

ఇదిలా ఉంటే కరోనా కట్టడికి అమెరికా దక్షిణ కొరియా సాయం కోరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర అభ్యరన మేరకు కరోనా వైరస్‌ పోరాటంలో తమ వంతు సహకారం అందజేస్తామని దక్షిణ కొరియా తెలిపింది. కొరియా సంస్థలకు అనుమతికి సహకరిస్తామని ట్రంప్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అత్యంత వేగంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే పరికరాన్ని దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.

డ్రాగన్‌కు పొరుగున ఉన్న దేశం దక్షిణ కొరియా. ఒకప్పుడు కొరియాలో కరోనా వ్యాప్తి చెందిన తీరు చూసి అందరూ మరో చైనా అవుతుందని భావించారు. దక్షిణ కొరియాలో 9 వేల మందికి కోవిడ్ సోకగా.. ప్రస్తుతం 125 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ దేశం కోవిడ్‌ వ్యాప్తిని అదుపు చేసింది. ఇప్పుడు ఆ దేశం దాదాపుగా సాధారణ స్థితికి చేరుకుంది. కరోనాపై పోరాటం కోసం కొరియా పెద్ద సంఖ్యలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు క్వారంటైన్‌లో ఉంచింది. కొరియాలో తొలి కరోనా కేసును జనవరిలో గుర్తించారు. కానీ ఆ కేసు బయటపడక ముందే వుహాన్‌లో కరోనా విజృంభిస్తున్న తీరును గమనించే కొరియా కంపెనీలు టెస్టు కిట్లను డెవలప్ చేయడం మొదలుపెట్టాయి.

కొరియాలో కరోనా పేట్రేగే సమయానికి రోజుకు పది వేల మందికిపైగా పరీక్షలు చేసే స్థాయికి ఆ దేశం చేరుకుంది. టెస్టింగ్ సెంటర్లతోపాటు హాస్పిటళ్లలో ఫోన్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఓ ప్రదేశంలో కరోనా కేసులు నమోదైతే.. ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు మొబైల్ ఫోన్ ద్వారా సందేశాలు పంపి.. అటు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. కనీసం 15 కొరియా సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి.