Washington, july 9: ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని (Global Coronavirus) రేపుతోంది, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు (Global Coronavirus Cases) 12 మిలియన్లకు పైగా నమోదు కాగా, 5,46,000 మంది (Global Coronavirus Deaths) మరణించారు. ఈ కేసుల్లో యునైటెడ్ స్టేట్స్, లాటిన్ అమెరికాలో సగానికి పైగా ఉన్నాయి. వైరస్ బారిన పడిన వారిలో సగం మంది కోలుకున్నారు. 3,055,101 కేసులు మరియు 132,309 మరణాలతో, యునైటెడ్ స్టేట్స్ అత్యంత నష్టపోయిన దేశంగా నిలిచింది. 1,713,160 కేసులు మరియు 67,964 మరణాలతో బ్రెజిల్ రెండవ స్థానంలో నిలిచింది. కరోనావైరస్‌పై కొత్త ట్విస్టు, ఈ వైరస్ గాలి ద్వారా సోకుతుందని నిర్ధారించిన సైంటిస్టులు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసిన 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు
రష్యాలో కోవిడ్ 19 కేసులు
గడిచిన 24గంటల వ్యవధిలో రష్యా (Russia) దేశంలోని 85 ప్రాంతాల్లో కొత్తగా 6509 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,778 మందికి ఎలాంటి లక్షణాలు కనిపించకున్నా పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని కరోనా వైరస్ ప్రతిస్పందన కేంద్రం తెలిపింది. 24గంటల వ్యవధిలో మాస్కోలో అత్యధికంగా 568 కేసులు నమోదైనా కేసుల పెరుగుదల శాతంలో మాత్రం ఆ నగరం చివరిస్థానంలో ఉందని అధికారులు పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 24గంటల వ్యవధిలో 292 కరోనా కేసులు నమోదయ్యాయి. రష్యాలో ఇప్పటి వరకు 7,07,301 కేసులు నమోదుకాగా 4,81,316 మంది చికిత్సకు కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24గంటల వ్యవధిలో ఆ దేశంలో 176 మంది మృతి చెందగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 10,843కు చేరింది. హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి విరుగుడు మందు, ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి.., భారత్ బయోటెక్ వ్యాక్సిన్ మీద క్లినికల్ టెస్టులు వేగవంతం చేసిన ఐసీఎంఆర్
అమెరికాలో కోవిడ్-19
అమెరికాలో (America) బుధవారం ఒక్కరోజే 60 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఫ్లోరిడాలో 10 వేలు, టెక్సాస్ లో 9,500, కాలిఫోర్నియాలో 8,500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాలిఫోర్నియా, టెక్సాస్ లో కరోనా మరణాలు కూడా అత్యధికంగా సంభవించాయి. బుధవారం ఒకే రోజు 900లకు పైగా కరోనాతో మృతి చెందారు. టెన్నెసీ, వెస్ట్ వర్జీనియా, ఉత్హాలో ప్రతి రోజు కొవిడ్ పాజిటివ్ కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. గత రెండు వారాల నుంచి 42 దేశాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. గత శుక్రవారం యూఎస్ లో 56,818 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు 3 మిలియన్లకు పైగా నమోదు అయ్యాయి. 1,32,000 మరణాలు సంభవించాయి.
కేసుల సంఖ్య ఎలా ఉన్నా.. మళ్లీ స్కూళ్లు తెరవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని స్కూళ్లను రీఓపెన్ చేయాలని వైట్‌హౌజ్ కూడా సూచనలు చేసింది. అయితే వైట్‌హౌజ్ కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్ అధినేత అయిన మంత్రి మైక్ పెన్స్ కొన్ని సూచనలు చేశారు. స్కూళ్లు రీఓపెన్ చేస్తే వాటిపై కఠిన ఆంక్షలు పెట్టరాదన్నారు. మరోవైపు కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో పదివేల కేసులు నమోదు అయ్యాయి.
బ్రెజిల్ అధ్యక్షుడు జైల్ బోల్సోనారోకి కరోనా
కరోనా విషయం లో జాగ్రత్తలు అవసరం లేదంటూ నిరక్ష్యం వహించిన బ్రెజిల్ అధ్యక్షుడు జైల్ బోల్సోనారో వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కాగా కొవిడ్‌ను గతంలో ఆయన మామూలు ఫ్లూగా అభివర్ణించారు. కరోనా వైరస్‌తో ఇబ్బందిపడుతున్న బ్రెజిల్ అధ్యక్షడు జైర్ బోల్సోనారో తాను హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందులు వాడుతున్నానని చెప్పారు. డాక్టర్లు హైడ్రాక్సీక్లోరోక్వీన్, అజిత్రోమైసిన్ మందులు ఇస్తున్నారని, వాటిని వాడిన తర్వాత తన ఆరోగ్యం కదుటపడిందని, మానసికంగా కూడా ధైర్యంగా ఉన్నానని బోల్సోనారో అన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు.
పాకిస్తాన్‌లో కరోనా వైరస్ కేసులు
పాకిస్తాన్‌లో గడిచిన 24 గంటల్లో 2,980 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2,37,489కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం తాజాగా 83 మంది కరోనాతో మరణించగా మొత్తం 4,922మంది మృత్యువాత పడ్డారు. దేశంలో రికవరీ రేటు మెరుగుపడుతోందని, ఇప్పటివరకు 1,40,965 మంది పూర్తిగా కోలుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 2,37,489 పాజిటివ్ కేసుల్లో సింధ్‌లో 97,626, పంజాబ్ 83,559, ఖైబర్ పఖ్తున్ఖ్వా 28,681, ఇస్లామాబాద్ 13,650, బలూచిస్తాన్ 10,919, గిల్గిట్ బాల్టిస్తాన్ 1,595, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో1,419 కేసులున్నాయి. గత 24 గంటల్లో 21,951 సహా ఇప్పటివరకు 14,67,104 పరీక్షలను అధికారులు నిర్వహించారు
గాలి ద్వారా కరోనా
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న విషయాన్ని కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గాలిలో ఉన్న తుంపర్ల వల్ల వైరస్ వ్యాప్తి చెందే ఆధారాలను పరిశీలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. ఒకవేళ వైరస్ గాలి ద్వారా సోకుతుందని తేలితే, అప్పుడు ఇన్‌డోర్ ప్రదేశాల్లో పాటించాల్సి మార్గదర్శకాలను డబ్ల్యూహెచ్‌వో మార్చే అవకాశాలు ఉన్నాయి. కాగా రెండు రోజుల క్రితం సుమారు 239 మంది శాస్త్రవేత్తలు ఓ అధ్యయనాన్ని వెలువడించిన విషయం విదితమే.
190కు పైగా దేశాలు విలవిల
చైనాలోని వుహాన్ నగరంలో మొదటగా(డిసెంబర్ 2019) వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ అతి తక్కువ సమయంలోనే ప్రపంచ దేశాలకు వ్యాపించింది.అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నది. కరోనా మహమ్మారి దెబ్బకు 190కు పైగా దేశాలు వణికిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 188 దేశాలకు వైరస్ విస్తరించింది. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లోకి కరోనా అడుగుపెట్టలేదు. కనీసం ఒక్క కేసు కూడా ఈ దేశాల్లో నమోదు కాలేదు. వీటిలో చాలా వరకు చిన్న దేశాలు(ద్వీపాలు) కావడం, విదేశీ రాకపోకలు లేకపోవడం వల్ల కరోనా దరిచేరలేదు. చైనాతో సరిహద్దును పంచుకునే ఉత్తర కొరియాలో కోవిడ్-19 కేసులు నమోదైనట్లు వార్తలు బయటకి రాకపోవడం ఆశ్చర్యపరిచే అంశంగా చెప్పుకోవచ్చు.
కరోనా భారీన పడని దేశాలు
కిరిబతి , మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, నౌరు, ఉత్తర కొరియా, పలావు, సమోవ, సాల్మన్ ఐలాండ్స్, టోంగా, తుర్క్‌మెనిస్థాన్, తువాలు, వనాటు