New Delhi, December 25: భారతదేశంలో కొత్తగా 23,068 కరోనా కేసులు (Coronavirus Outbreak) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,46,846కు చేరింది. ఇందులో 2,81,919 యాక్టివ్ కేసులు ఉండగా, 97,17,834 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,47,092 మంది (Covid Deaths) మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా బారినపడినవారిలో 336 మంది మరణించగా, 24,661 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
నిన్నటికంటే 6.6 శాతం తక్కువగా నమోదయ్యాయని వెల్లడించింది.మహారాష్ట్రలో అత్యధికంగా 19,09,951 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 49,058 మంది మరణించారు. ఇక, కర్ణాటకలో ఇప్పటివరకు 9,13,483, ఆంధ్రప్రదేశ్‌లో 8,80,075, తమిళనాడులో 8,11,115, కేరళలో 7,26,687, ఢిల్లీలో 6,20,681 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా జన్యుమార్పులతో కొత్తగా బయటకు వచ్చి అందరికీ వణుకు పుట్టిస్తోంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కొత్త రకం ఈ కరోనా వైరస్ బయటపడగా తాజాగా నైజీరియాలో కూడా ఈ కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. నైజీరియాలో ఇద్దరకు కొత్త రకం కరోనా వైరస్ ( new-covid-strain-in-nigeria) సోకినట్లు ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధినేత జాన్ కెంగసాంగ్ తెలిపారు. దీనిని ‘పీ681హెచ్'గా పిలుస్తున్నట్టు చెప్పారు. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో గుర్తించిన కరోనా ఉత్పరివర్తనంతో పోలిస్తే, ఇది భిన్నంగా ఉన్నదని.. లోతైన పరిశోధన చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఆగస్టు 3, అక్టోబర్ 9న నైజీరియాలోని ఓసన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ కొత్త రకం కరోనాను కనుగొన్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ ఓ కథనంలో వివరించింది. మరోవైపు, దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వేగంగా వ్యాపిస్తున్నదని, రోగుల్లో వైరల్ లోడ్ శాతం (రోగుల రక్తంలో వైరస్‌ల సంఖ్య) ఎక్కువగా ఉన్నట్టు కెంగసాంగ్ పేర్కొన్నారు.
డిసెంబర్ మొదటి వారంలో బ్రిటన్‌లో సగటున రోజుకు 15 వేల వైరస్ కేసులు నమోదవ్వగా ప్రస్తుతం 38 వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతె ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. దక్షిణాఫ్రికాలో డిసెంబర్ మొదటి వారంలో సగటున రోజుకు 4 వేల వైరస్ కేసులు రికార్డవ్వగా.. ప్రస్తుతం 14 వేల కేసులు నమోదవుతున్నాయి. నైజీరియాలో డిసెంబర్ మొదటి వారంలో సగటున రోజుకు 300 లోపునే వైరస్ కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం రోజుకు సగటున వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి.
కరోనా విజృంభిస్తుండటంతో ఇజ్రాయెల్ మూడోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది. ఆదివారం లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రెండు వారాల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.నైజీరియాలో బయటపడిన వైరస్‌ను ‘పీ681హెచ్'గా పిలుస్తున్నారు. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో గుర్తించిన కరోనా ఉత్పరివర్తనంతో పోలిస్తే, ఇది భిన్నమైంది.