New Delhi, December 22: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొత్త కరోనావైరస్ ఇండియాలోకి ఎంట్రీ (New Covid Strain in India) ఇచ్చేసింది. కోవిడ్ 19 ముప్పు త్వరలో ముగిసిపోతుందనే ఆశలపై నీళ్లు చల్లుతూ కొత్త కరోనావైరస్ ఇండియాలోకి ప్రవేశించింది. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికులలో కరోనా వైరస్ (COVID-19 Positive) బయటపడింది. ఇప్పటి వరకు లండన్ నుంచి వచ్చిన 8 మందికి కరోనా వైరస్ సోకింది.బ్రిటన్ నుంచి దేశ రాజధానిలో దిగిన అయిదుమంది ప్రయాణికులు, ముగ్గురు విమాన సిబ్బందిలో కరోనా వైరస్ (New Covid Strain) లక్షణాలు కనిపించాయి. వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు అధికారులు. వారి నమూనాలను సేకరించి, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)కు పంపించారు.
కాగా విమాన సర్వీసులను నిలిపివేయడానికి ముందే..అక్కడి నుంచి 266 మంది ప్రయాణికులు భారత్‌కు బయలుదేరారు. వారంతా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆ వెంటనే వారికి ఆర్టీపీసీఆర్ ద్వారా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. ఆ 266 మందిలో అయిదుమంది ప్రయాణికులు, విమాన సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వారికి నిర్వహించిన పరీక్షలు పాజిటివ్‌గా వచ్చాయి. దీనితో వారిని క్వారంటైన్‌కు తరలించారు. శాంపిళ్లను ఎన్సీడీసీకి పంపించారు. ఎన్సీడీసీ నుంచి నివేదికలు ఇంకా అందాల్సి ఉంది.
ఈ మధ్యకాలంలో విమాన ప్రయాణికులెవరూ కరోనా వైరస్ బారిన పడలేదు. అయితే కొత్తగా బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో అది కొత్త కరోనానా లేక పాతదేనా అనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. వారికి సోకిందే కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ అని నిర్ధారితమైతే.. మరోసారి దేశంలో లాక్‌డౌన్.. నైట్ కర్ఫ్యూ వంటి పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఇక ఈ అయిదుమందిలో విమాన సిబ్బంది కూడా ఉండటం..వారు ప్రయాణికులకు ఆహార పదార్థాలను అందించే సమయంలో వారి ద్వారా మిగిలిన 261 మంది ప్రయాణికులు, తోటి సిబ్బందికీ వైరస్ సోకే అవకాశాలు లేకపోలేదనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. అదే జరిగితే- విమాన ప్రయాణికులందరినీ ఎక్కడికక్కడ క్వారంటైన్లకు తరలించాల్సి ఉంటుందని, అదే సమయంలో- వారిని కాంటాక్ట్ వ్యక్తులను కూడా క్వారంటైన్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇది మరోమారు దేశంలో కరోనా వైరస్ విస్తరణకు దారి తీయొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌గా బ్రిటన్‌లో మొదట గుర్తించిన ‘వీయూఐ 202012/1’ ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇప్పటివరకు డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టన ఈ వైరస్ తాజాగా భారత్‌లో కూడా వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.