London, Dec 20: ప్రపంచాన్ని ఇప్పటి వరకు వణికించిన కరోనావైరస్ కొత్త రూపం (New COVID-19 Variant) సంతరించుకుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండగానే అది మళ్లీ తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రపంచదేశాలను ఈ కొత్త రూపు (new coronavirus variant) సంతరించుకున్న వైరస్ వణికిస్తోంది. బ‌్రిటన్‌లో కరోనా వైరస్ (Britain warns new Covid-19 virus) పరిస్థితి తమ చేయి దాటిపోయిందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంకాక్ చెప్పడం గమనార్హం. లండన్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌తో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్‌డౌన్ ప్రకటించిన కొద్ది గంటల తర్వాత హాంకాక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే ఇంగ్లండ్ నుంచి ప్రయాణాలపై స్కాట్లాండ్ నిషేధం విధించింది. వేల్స్ మరో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. కరోనా కొత్త వేరియంట్ గతం ఉన్న దాని కంటే 70 శాతం వేగంగా వ్యాపిస్తుండటంతో బ్రిటన్‌లో ఈ పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం లండన్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌ను కఠినమైన టైర్-4 కొవిడ్ అలెర్ట్ వ్యవస్థలో ఉంచారు. ఇది దాదాపు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌లాంటిదే. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందే వరకూ అంటే కొన్ని నెలల పాటు లండన్‌లో లాక్‌డౌన్ కొనసాగవచ్చని హాంకాక్ తెలిపారు. స్ట్రెయిన్ విజృంభణకు అవకాశమివ్వకూడదని భావించిన యూకే ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్-4ను విధించింది.
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో మూడున్నర లక్షల మంది ఫైజర్ అందించిన రెండు డోసుల టీకాను తీసుకున్నారు. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త లాక్‌డౌన్ నిబంధనల నుంచి తప్పించుకోడానికి శనివారం నుంచే చాలా మంది లండన్ వదిలి వెళ్లడానికి ప్రయత్నించారు. క్రిస్మస్ సంబరాలను రద్దు చేసుకోవాలన్న బ్రిటన్ ప్రధాని సూచనలు ఆదివారం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. దీంతో ఆరోగ్య మంత్రి హాంకాక్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
లండన్‌లో కరోనా న్యూ స్ట్రైయిన్ విజృంభిస్తుండటంతో పలు యూరోపియన్ దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. నెదర్లాండ్ ఆదివారం నుంచే బ్రిటన్ నుంచి వచ్చే అన్ని ప్రయాణ విమాన సర్వీసులపై నిషేధం విధించగా.. అదే ఆప్షన్‌ను తామూ పరిశీలిస్తున్నట్లు జర్మనీ అధికార వర్గాలు తెలిపాయి. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేస్తామని ఆ వర్గాలు చెప్పాయి.
ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి జనవరి ఒకటో తేదీ వరకు బ్రిటన్ విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు డచ్ ప్రకటించింది. నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ నిషేధాన్ని జనవరి 1 వరకూ కొనసాగించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. బెల్జియం మరో అడుగు ముందుకేసి ఆదివారం అర్థరాత్రి నుంచి బ్రిటన్ విమాన, రైళ్ల రాకపోకలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.అవసరమైతే ఈ నిషేధాన్ని పొడిగిస్తామని కూడా బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డీ క్రూ తెలిపారు. ఇటలీ కూడా యూకే నుంచి ప్యాసింజర్ విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్లు సమాచారం. అయితే.. ఈ నిషేధం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో, ఎప్పటివరకూ కొనసాగుతుందో ఇటలీ స్పష్టతనివ్వలేదు.
ఈ తరహా స్ట్రెయిన్ వైరస్ తొలుత సెప్టెంబర్‌లో ఒక వ్యక్తికి సోకినట్లు తెలుస్తున్నది. ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ అధికారి సుసాన్ హోప్‌కిన్స్ మాట్లాడుతూ నూతన వైరస్ 70శాతం ఇతరుల్లోకి ట్రాన్స్ మీట్ అవుతుందని ద్రువీకరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో క్రిస్మస్ వేడుకలు ఇళ్ల వద్దనే చేసుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్ననేపథ్యంలో ఇంగ్లాండ్ రాజధాని లండన్‌తో సహా పశ్చిమ, ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఆ ఆంక్షలు ఈరోజు (ఆదివారం) ఉదయం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా, దేశ ప్రజల రక్షణ తన బాధ్యత అనీ, ప్రజల భావోద్వేగాలు తనకు తెలుసు కానీ భారమైన హృదయంతో ఆంక్షలు విధించాల్సి వస్తున్నదన్నారు.