Pakistan Prime Minister Imran Khan | File photo | (Photo Credits: PTI)

Islamabad, October 18: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) పాకిస్తాన్‌ను 'బ్లాక్‌లిస్ట్' (Blacklist)లో చేర్చే ప్రమాదం నుంచి తప్పించి ఆ దేశానికి  కొంత ఊరట కల్పించింది.   అయితే ఎప్పట్లాగానే 'గ్రే లిస్టు' (Grey list) లో కొనసాగిస్తూ ఫిబ్రవరి 2020వరకు గడువు పొడగించింది.  ఆ లోపు  ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ విఫలమైతే, ఆ దేశంతో వ్యాపార సంబంధాలు మరియు దేశ లావాదేవీలపై

ప్రత్యేక దృష్టి పెట్టాలని  ప్రపంచ ఆర్థిక సంస్థలకు సూచిస్తామని టెర్రర్ ఫండింగ్ వాచ్‌డాగ్ తెలిపింది. గడువు పూర్తయ్యే లోపు ఉగ్రవాద నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పూర్తి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని పాకిస్తాన్‌కు FATF సూచించింది.

'FATF' అంతర్జాతీయంగా వివిధ దేశాల ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే ఒక సంస్థ. ఇది గనక ఏదైనా దేశాన్ని గ్రేలిస్ట్ చేసిందంటే IMF, ప్రపంచ బ్యాంక్ మరియు యూరోపియన్ యూనియన్ నుండి ఆర్థిక సహాయం పొందడం కష్టం. ఇతర దేశాల నుంచీ ఆర్థిక సహాయం అందించడం తగ్గించబడుతుంది. ఇక బ్లాక్ లిస్ట్ లో పెట్టడం అంటే ఇక ఆ దేశానికి ఆర్థిక సహాయం పూర్తిగా నిలిపివేయాలని అని అర్థం. పాకిస్థాన్ మనీలాండరింగ్‌‌కు పాల్పడుతుంది, డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తుంది. కాబట్టి ఎవరూ ఆ దేశానికి ఆర్థిక సహాయం చేయకూడదు అని ఒక హెచ్చరిక జారీచేయడం లాంటిది ఈ బ్లాక్ లిస్ట్.   భారత విమానానికి పాకిస్థాన్ ఫైటర్ జెట్ల వెంబడింపు

గతంలో ఉగ్రవాద నిర్మూలన దిశగా పాక్ (Pakistan) తీసుకున్న 40 రకాల చర్యల్లో 32 FATF నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. అలాగే అక్రమ నగదు చలామణీ, ఉగ్రవాదులకు విరాళాల పంపిణీలాంటి అంతర్జాతీయంగా అత్యంత కీలకంగా పరిగణించబడే అంశాల్లో, 11లో 10 పారామితుల FATF లక్ష్యాలను చేరుకోవడంలో పాకిస్థాన్ విఫలమైంది. దీంతో FATF పాకిస్థాన్ ను 'బ్లాక్ లిస్ట్ కు అర్హత గల' జాబితాలో చేరుస్తూ ఈ ఏడాది ఆగష్టు నెలలో నిర్ణయం తీసుకుంది. ఆనాడు అక్టోబర్ వరకు పాకిస్థాన్ కు గడువు విధించింది. ఈనెలతో గడువు పూర్తవుతుండటంతో మరోసారి సమావేశమైన FATF పాకిస్థాన్ గడువును ఫిబ్రవరి 2020 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రిపోర్ట్స్ ప్రకారం, నేటి FATF సమావేశానికి 205 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. బ్లాక్ లిస్టింగ్ నుంచి తప్పించుకోవడానికి ఏ దేశానికైనా మూడు ఓట్లు తప్పనిసరి. దీంతో పాకిస్తాన్ తమకు మద్ధతు ఇవ్వాల్సిందిగా చైనా, టర్కీ మరియు మలేషియా దేశాలపై ఆధారపడింది. ఆ దేశాల చొరవతో ప్రస్తుతానికి 'బ్లాక్ లిస్ట్' ప్రమాదం నుంచి బయట పడినట్లుగా తెలుస్తుంది.