pm-modi-to-embark-on-two-day-visit-to-saudi-arabia-today (Photo-ANI)

New, Delhi, October 28: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లనున్నారు. అంతర్జాతీయ బిజినెస్‌ ఫోరంలో పాల్గొనేందుకు సౌదీ వెళ్తున్నమోడీ వ్యూహాత్మక సంబంధాల బలోపేతం, వలసలు, చమురు వంటి కీలక అంశాలపై సౌదీ రాజుతో చర్చలు జరపనున్నారు. రక్షణ, భద్రతా సహకారం, సీమాంతర ఉగ్రవాదం, రారుగఢ్‌ లోని వెస్ట్‌కోస్ట్‌ రిఫైనరీ ప్రాజెక్టు తదితర అంశాలు ఈ టూర్‌లో చర్చకు రానున్నాయి. భారత్‌-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య కౌన్సిల్‌ ఏర్పాటు ఒప్పందంపై సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌‌తో కలిసి సంతకాలు చేయనున్నారు.అనంతరం ప్రతినిధి స్థాయి చర్చల్లో పాల్గొంటారు.

ఇదిలా ఉంటే మోడీ సౌదీ అరేబియా పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్‌ మరోసారి తన వక్ర బుద్దిని చాటుకుంది. సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా భారత్‌ చేసిన అభ్యర్థనను పాక్‌ తోసిపుచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణం చేసే విమానాన్ని తమ గగనతలం మీదుగా అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

మోడీ సౌదీ అరేబియా టూర్

జమ్మూ కశ్మీర్‌లో మానవహక్కులను ఉల్లఘించిదన్న కారణాన్ని సాకుగా చూపిస్తూ పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ స్వయంగా మీడియాకు తెలిపారు. అంతేకాదు అనుమతి నిరాకరణకు సంబంధించిన విషయాన్ని లిఖిత పూర్వకంగా భారత హైకమిషనర్‌కు తెలియజేయనున్నట్లు తెలిపారు. అంతకు ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐస్‌ల్యాండ్‌ పర్యటన సమయంలోనూ ఇదే విధంగా వ్యవహరించింది. బాలాకోట్‌ దాడుల తర్వాత కొద్దికాలం గగతనలాన్ని మూసివేసిన పాక్‌... అనంతరం తెరిచింది. అయితే, జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసేసింది.

సౌదీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ రూపే కార్డును విడుదల చేయనున్నారు. హజ్‌ యాత్రకు సౌదీ వెళ్లే భారతీయులకు ఈ రూపే కార్డు ఉపయోగపడనుంది. అలాగే, గల్ఫ్‌ దేశాల్లో యూఏఈ, బెహ్రెయిన్‌ తర్వాత రూపే కార్డు సౌకర్యం అందుబాటులోకి రానున్న దేశంగా సౌదీ అరేబియా ఖ్యాతి గడించనుంది. సౌదీ యువరాజుతో జరిగే భేటీలో 13 కీలకమైన అంశాలపై భారత్‌ ప్రధాని చర్చించనున్నారు. 2016లో మొదటిసారిగా సౌదీలో పర్యటించిన ప్రధాని మళ్లీ ఇప్పుడు వెళ్తున్నారు.