Dhaka, Mar 27: ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన బంగ్లాదేశ్‌లో (PM Modi Bangladesh Tour) కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన మతువా సముదాయం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మతువ తెగలతో సమావేశంలో (Matua community in Orakandi) ప్రధాని మోదీ మాట్లాడుతూ... చాలా సంవత్సరాలుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, ఇప్పుడు సఫలీకృతమైందని తెలిపారు.
ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా మథువా వర్గంతో భేటీ అయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘బెంగాల్‌లోని ఠాకూర్ నగర్‌లో నేను పర్యటించా. ఆ సందర్భం ఇంకా నాకు గుర్తుంది. అక్కడ మథువా ప్రజలు ఓ కుటుంబీకునిగా నన్ను ఆదరించారు. ఓ తల్లిలా ఆశీర్వదించారు. నా జీవితంలో అది గుర్తుండిపోయే ఘటన’’ అంటూ మోదీ గుర్తు చేసుకున్నారు.బంగ్లాదేశ్ 50 వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 130 కోట్ల భారతీయుల ప్రేమను, ఆప్యాయతను, శుభాకాంక్షలను మోసుకొచ్చానని తెలిపారు.
Here's ANI Tweet
We are very happy and proud as PM Narendra Modi paid a visit here today. The entire Matua community is glad. We thank our Prime Minister for inviting Narendra Modi Ji: Mintu Biswas, a representative of Matua community in Bangladesh. pic.twitter.com/hg7SKoVlFQ
— ANI (@ANI) March 27, 2021
భారత్, బంగ్లాదేశ్ ప్రగతి సాధించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం, ప్రేమ, శాంతిని రెండు దేశాలు కాంక్షిస్తున్నాయన్నారు. అస్థిరత్వం, ఉగ్రవాదం, అసహనానికి వ్యతిరేకంగా రెండు దేశాలు పోరాడుతున్నాయన్నారు. కరోనా మహమ్మారి సమయంలో రెండు దేశాలు తమ సామర్థ్యాన్ని నిరూపించాయన్నారు.
మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొంటున్నాయని, కలిసికట్టుగా పోరాడుతున్నట్లు చెప్పారు. మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు బంగ్లాదేశ్‌కు చేరినట్లు ప్రధాని తెలిపారు. బంగ్లాకు స్వాతంత్య్రం సిద్ధించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒరాకాండిలోని బాలికల పాఠశాలను భారత ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తుందని, అలాగే ఓ ప్రాథమిక పాఠశాలను కూడా ఏర్పాటు చేస్తుందని మోదీ ప్రకటించారు.
ప్రధాని మోదీ ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని, దాని పట్ల గర్వంగా ఫీలవుతున్నామని మతువ తెగకు చెందిన ప్రజలు తెలిపారు. మతువ కమ్యూనిటీ మొత్తం ఆనందంలో తేలిపోతోందని ఆ వర్గ ప్రతినిధి మింటూ బిశ్వాస్ తెలిపారు. మోదీకి ఆహ్వానం పంపిన ప్రధాని షేక్ హసీనాకు థ్యాంక్స్ చెప్పారు. మతువ కులస్థులు హిందూ మతానికి చెందినవారే. శూద్ర వర్ణానికి చెందిన వీరిని ఎస్సీలుగా గుర్తిస్తారు. బంగ్లాదేశ్‌లోని ఓరాకండిలో ఈ తెగవకు చెందిన వారి సంఖ్య అధికంగా ఉంది.